వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదు: ఫిలిం ఛాంబర్
తాజా సందేశం దేనికోసం? అంటే .. నిర్మాతలు ఇకపై షూటింగులకు వెళుతుంటే, దానిని విధిగా ఫిలింఛాంబర్ దృష్టికి తీసుకురావాలనేది దీని ఉద్దేశం.
By: Sivaji Kontham | 8 Aug 2025 6:03 PM ISTగడిచిన ఐదారు రోజులుగా మెరుపు సమ్మెతో సినీకార్మికులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణల దశలో ఉన్న చాలా సినిమాల షెడ్యూళ్లు తల్లకిందులయ్యాయి. నిర్మాతలు- ఫిలింఛాంబర్ ప్రతినిధులు ఈ అంశంపై చాలా తర్జనభర్జన సాగిస్తున్నారు. ఓవైపు ఫెడరేషన్ (24 శాఖల కార్మిక సమాఖ్య)తో చర్చలు జరుపుతూనే, ఇప్పుడు ఫిలించాంబర్ ఒక సందేశాన్ని (షార్ట్ మెసేజ్) పంపడం చర్చనీయాంశమైంది. దీని ప్రకారం...
ఏకపక్ష సమ్మెకు కౌంటర్:
24 శాఖలతో అనుసంధానమైన కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) నుంచి అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా వారితో ఎలాంటి చర్చలు లేదా సంప్రదింపులు జరపకూడదని తెలుగు ఫిలింఛాంబర్ ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ నిబంధన తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటాయని పేర్కొంటూ ఛాంబర్ గౌరవకార్యదర్శి తాజాగా తమ సందేశం(నోట్)లో పేర్కొన్నారు.
ఛాంబర్ కఠిన ఆదేశాలు:
ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు ఫెడరేషన్ అనుసంధాన యూనియన్ల సభ్యులైన కార్మికులకు ఎలాంటి సేవలూ అందించకూడదు అనే కఠినమైన ఆదేశాల్ని ఛాంబర్ జారీ చేసింది. ముఖ్యంగా నిర్మాతలు -స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆచరించాలని పిలుపునిచ్చింది.
ఈ సందేశం వెనక పరమార్థం?
తాజా సందేశం దేనికోసం? అంటే .. నిర్మాతలు ఇకపై షూటింగులకు వెళుతుంటే, దానిని విధిగా ఫిలింఛాంబర్ దృష్టికి తీసుకురావాలనేది దీని ఉద్దేశం. తద్వారా సెట్స్ లో ఏం జరుగుతున్నా పూర్తి సమాచారం ఫిలింఛాంబర్ కు ఉంటుంది. అలాగే సెట్లలో పని చేస్తున్నది ఫెడరేషన్ సభ్యులా లేక కొత్త ప్రతిభను ఎంపిక చేసుకున్నారా? అనే విషయం కూడా ఫిలింఛాంబర్ కు తెలుస్తుంది. అయితే యూనియన్లలో సభ్యత్వం ఉన్న కార్మికులను కాకుండా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలని ఇంతకుముందు ఫిలింఛాంబర్ ఒక నోట్ రిలీజ్ చేసింది. తాజాగా జారీ చేసిన నోట్ చూస్తుంటే కార్మికుల చర్యలకు కౌంటర్ ఎటాక్ పెద్ద స్థాయిలో ఉండబోతోందని భావిస్తున్నారు. నిర్మాతలు తమ బడ్జెట్లు అదుపు తప్పకుండా తమను తాము కాపాడుకోవాలంటే, తమకు అనుకూలమైన నిపుణులైన కార్మికులతో పని చేయించుకోవడం తప్పేమీ కాదని ఆంధ్రప్రదేశ్ ఫిలింఛాంబర్ సెక్రటరీ జేవీ మోహన్ గౌడ్ అన్నారు.
