Begin typing your search above and press return to search.

బడ్జెట్ భారం వర్సెస్ బతుకుదెరువు.. టాలీవుడ్ లో కొత్త టెన్షన్!

టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా తీయడం కంటే ఆ సినిమా రోజువారీ ఖర్చులను మేనేజ్ చేయడమే నిర్మాతలకు పెద్ద టాస్క్ గా మారిపోయింది.

By:  M Prashanth   |   11 Oct 2026 7:00 AM IST
బడ్జెట్ భారం వర్సెస్ బతుకుదెరువు.. టాలీవుడ్ లో కొత్త టెన్షన్!
X

టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా తీయడం కంటే ఆ సినిమా రోజువారీ ఖర్చులను మేనేజ్ చేయడమే నిర్మాతలకు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఒకప్పుడు టాప్ హీరో సినిమాకు రోజుకు 15 లక్షల రూపాయలు ఖర్చయితే అదే ఒక పెద్ద నంబర్ అనుకునేవారు. కానీ ఇప్పుడు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు కూడా ఫస్ట్ డే షూట్ నుంచే రోజుకు 15 లక్షలు కచ్చితంగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎక్స్ పెన్సెస్ భరించలేక చాలామంది ప్రొడ్యూసర్లు సతమతమవుతున్నారు.

సెట్స్ పైకి సినిమా వెళ్లినప్పటి నుంచి నిర్మాత జేబుకు చిల్లులు పడటం స్టార్ట్ అవుతుంది. క్యారవాన్లు, జనరేటర్లు, హై ఎండ్ ఎక్విప్మెంట్ రెంట్లు, ఫుడ్, డీజిల్, డైలీ బత్తాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పరోక్ష ఖర్చులు వచ్చి పడుతున్నాయి. ఏ సినిమా సెట్ చూసినా కనీసం 100 నుంచి 150 మందికి తగ్గకుండా రోజూ సిబ్బంది కనిపిస్తున్నారు. ఇదంతా సినిమాలో కంటెంట్ కోసం అవుతున్న ఖర్చు కంటే, కాంప్లిమెంటరీగా వస్తున్న బర్డెన్ గానే సినిమా నిర్మాతలు ఫీల్ అవుతున్నారు.

ఇక్కడే ఇండస్ట్రీ వర్గాలకు ఫెడరేషన్ రూల్స్ పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. వాస్తవానికి ఒక సీన్ ను కేవలం 40, 50 మందితో చాలా ఈజీగా తీసేయొచ్చు. కానీ ఫెడరేషన్ నిబంధనల వల్ల ఒక కెమెరాను కదపడానికి కూడా 4 మంది కావాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి 10 మంది డాన్సర్లను తీసుకొస్తే, సెట్ లో చోటు ఉన్నా లేకపోయినా కచ్చితంగా లోకల్ వాళ్ళను కూడా మరో 10 మందిని పనిలోకి తీసుకోవాల్సిందే అనే కండిషన్ నిర్మాతలకు ఒక రేంజ్ లో తలనొప్పిగా మారుతోంది.

ఒకవేళ ప్రొడ్యూసర్ కు తన సినిమాను తన ఇష్టం వచ్చినట్లు తీసుకునే స్వేచ్ఛ ఇస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. కేవలం అవసరమైన వాళ్ళను మాత్రమే పెట్టుకుని షూటింగ్ చేస్తే అన్ వాంటెడ్ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. ఫైటర్లు, డాన్సర్ల విషయంలో లోకల్ యూనియన్ల నుంచి వచ్చే ఒత్తిడి తగ్గితే బడ్జెట్ కంట్రోల్ లోకి వస్తుందని ఇండస్ట్రీలో చాలామంది మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. స్వేచ్ఛగా సినిమాలు తీసుకునే వాతావరణం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు.

అయితే ఈ నాణేనికి మరో వైపు కూడా కచ్చితంగా ఆలోచించాల్సి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిర్మాతలు తమ బడ్జెట్ తగ్గించుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుని, ఫెడరేషన్ రూల్స్ ను పక్కనపెడితే చాలామందికి జీవనోపాధి పోయే ప్రమాదం ఉంది. ఏళ్ల తరబడి కేవలం సినిమా సెట్ల మీదనే ఆధారపడి బతుకుతున్న లైట్ బాయ్స్, లోకల్ డాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని మరికొందరు అంటున్నారు.

ఇలా రోజువారీ వేతనాలతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళందరికీ సినిమానే ఏకైక ఆధారమని చెబుతున్నారు. బడ్జెట్లు పెరిగిపోతున్నాయనే బాధ ప్రొడ్యూసర్ల వైపు నుంచి చూస్తే 100 శాతం కరెక్టే అనిపిస్తుంది. అలాగని వాళ్ళు అనుకున్నట్లే కాస్ట్ కటింగ్ చేసుకుంటూ పోతే అట్టడుగున ఉన్న 24 క్రాఫ్ట్స్ కార్మికుల పొట్ట కొట్టినట్లు అవుందనేది మరికొందరి ఆవేదన. ఈ రెండు వర్గాల మధ్య అప్పుడప్పుడు వివాదాల వలన స్ట్రైక్ లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక ఇండస్ట్రీ పెద్దలు రానున్న రోజుల్లో ఒక పరిష్కారం తీసుకురావాలనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.