Begin typing your search above and press return to search.

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కలకలం: సుమలత కార్యవర్గం రద్దు.. జానీ మాస్టర్‌కు షోకాజ్

తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదాలు తారాస్థాయికి చేరడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 7:44 PM IST
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కలకలం: సుమలత కార్యవర్గం రద్దు.. జానీ మాస్టర్‌కు షోకాజ్
X

తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదాలు తారాస్థాయికి చేరడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు, లుకలుకలు తలెత్తడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ వివాదానికి తెరదించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమలత, రఘు మాస్టర్‌తో పాటు సుమారు 225 మంది డ్యాన్సర్లతో వెంకటగిరిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను సేకరించగా.. రఘు మాస్టర్‌కు అనూహ్యంగా 214 మంది డ్యాన్సర్లు మద్దతు తెలిపారు. కేవలం 11 మంది మాత్రమే సుమలత వైపు నిలబడ్డారు.

ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే సుమలతపై కొంతమంది తోటి డ్యాన్సర్లు దాడికి దిగినట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన సుమలత.. తన వర్గంతో కలిసి నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్ నుంచే మీడియాతో మాట్లాడి తమ వాదన వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కూడా ఫిల్మ్ ఫెడరేషన్ గట్టి షాకిచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతిష్ఠను - గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అసోసియేషన్‌లో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు.. ఖాళీ అయిన అధ్యక్ష పదవికి సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న‌ అక్టోబర్ 11న తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్త‌గా ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఇంత‌కుముందు ర‌ఘు మాస్టార్ అధ్య‌క్షుడుగా ఒక కొత్త కార్య‌వ‌ర్గం ఎన్నిక గురించి సాగిన ప్ర‌చారానికి దీంతో తెర‌ప‌డిన‌ట్ట‌యిది.