Begin typing your search above and press return to search.

పవన్, నిహారికపై స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఎంట్రీతో సీన్ రివర్స్

అయితే ఇప్పుడు మరో చోట అనుదీప్ స్టాండప్ షో జరుగుతున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

By:  M Prashanth   |   12 April 2026 11:52 AM IST
పవన్, నిహారికపై స్టాండప్ కమెడియన్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఎంట్రీతో సీన్ రివర్స్
X

స్టాండప్ కామెడీ పేరుతో వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల ఎక్కువవుతున్న నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌ గా గుర్తింపు పొందిన అనుదీప్ కటికాల తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.

ఇటీవల నిర్వహించిన ఓ స్టాండప్ షోలో డివోర్స్ అంశంపై మాట్లాడిన అనుదీప్, కొన్ని ప్రముఖుల వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ జోకులు పేల్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ముఖ్యంగా మెగా అభిమానులు ఆ కామెంట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను పబ్లిక్ వేదికపై హాస్యంగా చూపించడం సరైంది కాదని వారు అభిప్రాయపడ్డారు.

అయితే ఇప్పుడు మరో చోట అనుదీప్ స్టాండప్ షో జరుగుతున్న సమయంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రేక్షకులు వేదికపైకి దూసుకెళ్లి అనుదీప్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన అనుదీప్, పరిస్థితిని అంచనా వేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనతో కార్యక్రమం కొంతసేపు నిలిచిపోయింది.

ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. వీడియోల్లో ప్రేక్షకుల ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుండగా, కొందరు అభిమానులు కమెడియన్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అనుదీప్ కటికాల వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆ పోస్టులే కనిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు అనుదీప్ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం సమంజసం కాదని వారు అంటున్నారు. హాస్యం అనేది హద్దుల్లో ఉండాలని, ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అనుదీప్ కటికాల బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకుంటే ఇలాంటి చేదు అనుభవాలు తప్పవని చెప్పాలి.

ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్‌పై విమర్శలు చేయడం ఒక విషయం అయితే, వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే స్టాండప్ కామెడీకి కొన్ని మార్గదర్శకాలు అవసరమని కూడా సూచిస్తున్నారు. కామెడీకి ఫుల్ ఫ్రీడమ్ ఉన్నప్పటికీ, అది ఇతరుల గౌరవాన్ని కించపరచకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.