ఇప్పుడు లోకల్ ఫ్లేవర్ వైపు టాలీవుడ్ మ్యూజిక్
పూర్తిగా కొత్త ట్యూన్ కంటే, జనాలకు ముందే తెలిసిన లోకల్ ఫోక్ హుక్‌ను తీసుకుని హీరోకు తగ్గట్టు మార్చే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 29 Aug 2026 4:05 PM ISTమొన్న ‘ఇరుముడి’లో ‘మల్లెపూల పల్లకి’ వచ్చింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో ‘యేష నాగుల’ వచ్చింది. ఈ రెండు పాటలు చూస్తే ఈ మధ్య మాస్ సాంగ్స్ కోసం సినిమా వాళ్లు ఎటు చూస్తున్నారో అర్థమవుతోంది. పూర్తిగా కొత్త ట్యూన్ కంటే, జనాలకు ముందే తెలిసిన లోకల్ ఫోక్ హుక్‌ను తీసుకుని హీరోకు తగ్గట్టు మార్చే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఇది కొత్తగా మొదలైన పద్ధతి కాదు కానీ ఇప్పుడు స్టార్ సినిమాల్లో కూడా వరుసగా కనిపిస్తోంది.
పెళ్లిళ్లు, దావత్‌లు, ఫంక్షన్లు, డీజేల్లో ఈ మధ్య ప్రైవేట్ ఫోక్ పాటలకు మంచి స్పేస్ ఉంది. సినిమా హీరో లేకపోయినా బీట్ పట్టేస్తే పాట చాలా దూరం వెళ్తోంది. బుల్లెట్టు బండి, పల్సర్ బైక్, రాను బొంబాయికి రాను.. లాంటి పాటలు ముందే జనాల్లో తిరిగాయి. తర్వాత ‘ధమాకా’లో ‘పల్సర్ బైక్’ రావడంతో అదే పాటకు సినిమా రేంజ్ కూడా జతైంది. ఇప్పుడు ఆ పద్ధతిని మరిన్ని సినిమాలు వాడుతున్నాయి.
‘ఇరుముడి’లో ‘మల్లెపూల పల్లకి’ కోసం ఒరిజినల్ పాడిన డప్పు శ్రీనునే తీసుకున్నారు. ‘ది ప్యారడైజ్’లో ‘యేష నాగుల’కు కూడా జంగి రెడ్డి గొంతే ఉంది. అంటే పాటను సినిమా కోసం మార్చినా, జనాలకు తెలిసిన అసలు వాయిస్‌ను వదలడం లేదు. అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ పని మొదలవుతోంది. హీరో ఇమేజ్, సీన్, డ్యాన్స్‌కు తగ్గట్టు బీట్ మార్చాలి.
కానీ ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది. కొత్త పాటైతే ప్రేక్షకుడు మొదటిసారి వింటాడు. పాత ఫోక్ పాటను మార్చితే మాత్రం ఒరిజినల్‌తో పోలిక వెంటనే మొదలవుతుంది. ‘మల్లెపూల పల్లకి’ కొత్త వెర్షన్‌పై కూడా పాతదాంట్లో ఉన్న ఫీల్ మిస్ అయిందనే కామెంట్స్ వచ్చాయి. ‘యేష నాగుల’కూ అదే పోలిక తప్పదు. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆ పాత టచ్ మిస్ అయితే జనాలు వెంటనే పట్టేస్తారు.
నిజానికి జనాల మైండ్ ఏ బీట్‌కు వెంటనే రియాక్ట్ అవుతుందో పట్టుకోవడం కష్టం. రీల్స్, షార్ట్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి రోజూ కొత్త పాటలు వస్తున్నాయి. అందులో ముందే పట్టేసిన ఫోక్ హుక్ ఉంటే సినిమా టీమ్‌కు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దాన్ని కొత్తగా మలిచే పని మాత్రం ఇంకా కష్టమే. ఇక ముందు ఈ ట్రెండ్ పెరిగితే ఫోక్ సింగర్స్‌కూ మరింత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ పాత రోజుల్లో లాగా మళ్ళీ అసలైన బీట్స్ కూడా తీసుకు రావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
