టాలీవుడ్‌ను ఏలుతోన్న మాఫియా కథలు!
నాగార్జున నటిస్తోన్న ల్యాండ్‌మార్క్ 100వ సినిమా పక్కా మాఫియా - రౌడియిజం నేపథ్యంతో కూడిన భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోందని వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 31 May 2026 8:15 AM ISTఏ పరిశ్రమలోనైనా? ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్ తెరపైకి వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీలు, అటుపై పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రాలు బాక్సాఫీస్‌ను ఏలాయి. ప్రస్తుత కాలంలో టాలీవుడ్ మేకర్స్ రూట్ మార్చారు. ప్రేక్షకులు కూడా హై-వోల్టేజ్ యాక్షన్, డార్క్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ ఎలి మెంట్స్ వైపు మొగ్గు చూపుతుండటంతో టాలీవుడ్‌లో `మాఫియా`-`గ్యాంగ్‌స్టర్` జానర్ల హవా నడుస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అగ్ర హీరోలంతా అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమ వుతున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్‌లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ముందు వరుసలో నిలుస్తున్నారు. మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `మెగా 158` ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఇందులో చిరంజీవి మునుపెన్నడూ కనిపించని విధంగా పూర్తి స్థాయి మాఫియా డాన్‌గా కనిపిస్తారని సమాచారం. అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కూడా ఇదే బాట పట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించే పవర్‌ఫుల్ డాన్‌గా రౌద్రం చూపించ బోతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో కింగ్ అక్కినేని నాగార్జున కూడా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయి కోసం ఈ జానర్‌నే ఎంచుకున్నారు.
నాగార్జున నటిస్తోన్న ల్యాండ్‌మార్క్ 100వ సినిమా పక్కా మాఫియా - రౌడియిజం నేపథ్యంతో కూడిన భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోందని వినిపిస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకునే నాగ్ ఈ మైలురాయి చిత్రంలో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించనుండటం అటు అక్కినేని అభిమానుల్లో.. ఇటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లోకల్ మాఫియానే కాకుండా.. ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ కథలతో టాలీవుడ్ పరిధి గ్లోబల్ స్థాయికి చేరుతోంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ `డ్రాగన్`. ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా చిత్రంలో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిని శాసించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు.
ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ గ్రే షేడ్స్, తారక్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోడై ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. ఇదే రేసులోకి నేచురల్ స్టార్ నాని కూడా విభిన్నమైన రోల్‌తో అడుగు పెట్టాడు. గన్ షాట్ యాక్షన్ చిత్రాలను అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నాని `బ్లడీ రోమియో` అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటిస్తున్నారు. పక్కింటి అబ్బాయిలా, సాఫ్ట్ క్యారెక్టర్లలో అలరించే నాని ఈ సినిమాలో వైల్డ్ అండ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. మొత్తంగా టాలీవుడ్‌ను ప్రస్తుతం మాఫియా కథలు ఏలుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై వీధుల నుండి అంతర్జాతీయ సరిహద్దుల వరకు విస్తరించిన అండర్‌వరల్డ్ సామ్రాజ్యాల చుట్టూ మన హీరోలు చేస్తోన్న ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు సాధిస్తాయి? అన్నది చూడాలి.
