నక్సలైట్ పాత్రల్లో మెరుస్తున్న స్టార్ హీరోయిన్లు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక భావజాలం, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో పురుష అగ్ర హీరోలు .. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వంటి నటులకే పరిమితమైన ఈ జానర్ ప్రస్తుతం సరికొత్త మలుపు తిరిగుతోంది.
By: Srikanth Kontham | 21 Jun 2026 3:00 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక భావజాలం, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. గతంలో పురుష అగ్ర హీరోలు .. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి వంటి నటులకే పరిమితమైన ఈ జానర్ ప్రస్తుతం సరికొత్త మలుపు తిరిగుతోంది. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నేటి తరం స్టార్ హీరోయిన్లు సైతం సంప్రదాయ చట్రాలను బద్దలు కొడుతూ గన్స్ పట్టుకుని అడవుల బాట పడుతున్నారు. కేవలం కథానాయకుడి వెనుక నడిచే పాత్రలు కాకుండా కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ విప్లవ నారీమణులుగా వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్‌కు బలమైన పునాది వేసిన చిత్రం `విరాటపర్వం`. ఇందులో సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో అడవి బాట పట్టిన కామ్రేడ్ రవన్న ప్రేమ కోసం విప్లవ తీరానికి చేరే ముక్కుసూటి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుత నటనతో ఆకట్టుకుంది. తుపాకీ పట్టి విప్లవకారులతో కలిసి నడిచే సన్నివేశాల్లో అమ్మడు చూపించిన ఎమోషన్, తీవ్రత హీరోయిన్ ఓరియెంటెడ్ నక్సలైట్ పాత్రలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ క్రేజీ సిరీస్‌లో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మంధాన కూడా చేరిపోవడం ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఆమె నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా `మైసా` లో రష్మిక అడవి బిడ్డగా, గోండు జాతి గిరిజన యువతిగా ప్లాష్ బ్యాక్ లో కనిపించబోతోందిట. సమాజంలో తమ జాతికి జరిగే అన్యాయంపై ఎదిరించి తుపాకీ పట్టి నక్సలైట్‌గా మారే అత్యంత పవర్‌ఫుల్ అండ్ రా పాత్ర ఇది. పూర్తి స్థాయి యాక్షన్ రోల్ కోసం రష్మిక ఏకంగా 60 రోజుల పాటు ఎంతో కఠినమైన శారీరక ..ఆయుధ శిక్షణ తీసుకోవడం విశేషం. ఇంకా అనుష్క, నయనతార లాంటి స్టార్ భామలు విప్లవ భావజాలం కథలవైపు కనక్ట్ అవుతున్నారు అన్నది తాజా సమాచారం. సరైన కథలు కుదిరితే తుపాకీ పట్టడానికి తాము సైతం సిద్దంగా ఉన్నారని సోర్సెస్ ద్వారా తెలిసింది.
ఇలా స్టార్ హీరోయిన్లు ఈ తరహా సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం నటిగా తమ పరిధిని విస్తరించుకోవడమే. నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకులు రొటీన్ ఫార్ములా కథలను తిరస్కరిస్తున్నారు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఇది గమనించిన కథానాయికలు మేకప్ లేకుండా.. మురికి పట్టిన దుస్తులు, చేతిలో రైఫిల్‌తో అడవుల్లో కష్టపడటానికి సైతం వెనుకాడటం లేదు. శారీరక శ్రమతో కూడిన ఇలాంటి పాత్రలు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ పెంచడమే కాకుండా కెరీర్ గ్రాఫ్‌కు విమర్శకుల ప్రశంసలను కూడా అందిస్తున్నాయి.తెలుగు చిత్రసీమలో నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ పాత్రలు హీరోయిన్ల ఇమేజ్‌ను ప్రశంసనీయంగా మార్చేస్తున్నాయి. గ్లామర్ తారలనే ముద్రను చెరిపేసి థియేటర్లలో ఒంటరి పోరాటంతో ప్రేక్షకులను కట్టిపడేసే సత్తా తమకు ఉందని స్టార్ భామలు నిరూపిస్తున్నారు.
