Begin typing your search above and press return to search.

మంచి సినిమాకు ప్ర‌చారం లేదు.. ప్ర‌చారం చేసిన సినిమా?

ఆ ప్ర‌కార‌మే త‌న కొత్త చిత్రం పాపం ప్ర‌తాప్‌ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేశాడు తిరువీర్. మిగ‌తా టీం కూడా బాగానే క‌ష్ట‌ప‌డింది.

By:  Garuda Media   |   22 April 2026 12:43 PM IST
మంచి సినిమాకు ప్ర‌చారం లేదు.. ప్ర‌చారం చేసిన సినిమా?
X

కొన్నిసార్లు సినిమాలో కంటెంట్ ఉన్నా.. ప్రి రిలీజ్ బ‌జ్ లేక, జ‌నాల‌కు రీచ్ కాక అవి ఆశించిన ఫ‌లితాన్ని అందుకోకుండానే థియేట‌ర్ల నుంచి వెళ్లిపోతుంటాయి. మంచి సినిమా తీసినా చూడ‌లేద‌ని మేక‌ర్స్ ఆవేద‌న చెందుతుంటారు. గ‌త ఏడాది ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో అనే సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింది. తిరువీర్ హీరోగా న‌టించిన ఈ చిత్రం గ‌త ఏడాది వ‌చ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒక‌ట‌న‌డంలో సందేహం లేదు.

ఒక‌ ప‌ల్లెటూరి ఫొటోగ్రాఫ‌ర్ క‌థ‌ను చాలా అందంగా చెప్పింది చిత్ర బృందం. కానీ స‌రైన ప్ర‌మోష‌న్లు లేక సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌లేదు. థియేట‌ర్ల‌లో ఆశించిన ఫ‌లితాన్నందుకోని ఈ చిత్రాన్ని ఓటీటీలో మాత్రం ప్రేక్ష‌కులు బాగానే చూశారు. ఇంత మంచి సినిమా హిట్ కాలేదేంటి అని ఫీల‌య్యారు. ఈ విష‌యంలో హీరో తిరువీర్ కూడా కొంచెం బాధ ప‌డ్డాడు. ఐతే ఇక‌పై త‌న సినిమాల‌కు ప్ర‌మోష‌న్ ప‌రంగా అన్యాయం జ‌ర‌గ‌ద‌ని అత‌ను హామీ ఇచ్చాడు.

ఆ ప్ర‌కార‌మే త‌న కొత్త చిత్రం పాపం ప్ర‌తాప్‌ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేశాడు తిరువీర్. మిగ‌తా టీం కూడా బాగానే క‌ష్ట‌ప‌డింది. నిర్మాత‌లు ప్ర‌మోష‌న్ కోస‌మే ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కూడా పెట్టారు. కానీ ఇంత చేసి ఏం లాభం? సినిమాలో విష‌యం లేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా స‌రే.. ఎగ్జిక్యూష‌న్లో ఫెయిలైన ఈ చిన్న సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌మోష‌న్లు బాగా చేయ‌డం వ‌ల్ల‌ సినిమాకు ముందు రోజు వేసిన‌ పెయిడ్ ప్రిమియ‌ర్స్‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది.

కానీ మూవీ అంచనాల‌కు త‌గ్గ‌ట్లు లేక‌పోవ‌డం, రివ్యూలు నెగెటివ్‌గా రావ‌డంతో త‌ర్వాత థియేట‌ర్ల‌లో జ‌నాలు క‌ర‌వ‌య్యారు. తిరువీర్ మ‌రోసారి త‌న పాత్ర‌ను చ‌క్క‌గా పోషించినా.. అత‌డికి అదృష్టం క‌లిసి రాలేదు. పోయినేడాది మంచి సినిమా చేసి ప్ర‌చారం క‌ర‌వవ‌డం వ‌ల్ల హిట్ అందుకోలేక‌పోయాడు. ఈసారి ప్ర‌మోష‌న్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డా.. సినిమాలో విష‌యం లేక ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. మ‌రి రెండూ క‌లిసి వ‌చ్చి అత‌డి ఖాతాలో హిట్ ఎప్పుడు ప‌డుతుందో చూడాలి.