పెద్దోళ్లు కుర్రాళ్లను ప్రోత్సహిస్తే అద్భుతాలెన్నో!
అగ్రహీరోలు-అగ్ర బ్యానర్లు-అగ్ర దర్శకులనే నియమంతోనే ఇండస్ట్రీ నడుస్తోంది. అగ్ర బ్యానర్లు-దర్శకులు కొత్తతరం తో సినిమాలు చేయడం అన్నది ఇంత వరకూ జరగలేదు.
By: Srikanth Kontham | 3 Oct 2025 1:00 AM ISTఅగ్రహీరోలు-అగ్ర బ్యానర్లు-అగ్ర దర్శకులనే నియమంతోనే ఇండస్ట్రీ నడుస్తోంది. అగ్ర బ్యానర్లు-దర్శకులు కొత్తతరం తో సినిమాలు చేయడం అన్నది ఇంత వరకూ జరగలేదు. కాంబినేషన్ పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు గానీ వాటిలో బలమైన కంటెంట్ ఉంటుందా? అంటే అలా అన్నివేళలా సాధ్యపడటం లేదు. చాలా రేర్ గానే సక్సెస్ లు కనబడుతున్నాయి. ఏడాది మొత్తంలో చూసుకుంటే అలాంటి సక్సెస్ రెండు..మూడు చిత్రాలకు మించి కనిపిచడం లేదు. అదీ అతి కష్టం మీద సాధ్యమవుతుంది. ప్రతిగా నిర్మాణ సంస్థలు నష్టాల భారం మోయాల్సి వస్తోంది.
అగ్ర బ్యానర్ తో అద్భుతమే:
అదే బ్యానర్ రెండు అడుగులు కిందకు దిగగలిగితే అద్బుతాలు సృష్టించడానికి అవకాశం ఉందన్నది కాదనలేని వాస్తవం. కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేకుండా సక్సెస్ లు సాధిస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు ..మూడేళ్లగా తెలుగులోనూ ఇలాంటి విజయాలు ఎన్నో నమోదవుతున్నాయి. ఇంకా ఆ సినిమాలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో రీచ్ తక్కువగా ఉంటుంది. అదే ఓఅగ్ర బ్యానర్ అలాంటి సినిమాలు చేయగల్గితే ఇండస్ట్రీలో మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. కంటెంట్ ని క్వాలిటీగా చూపించే ఛాన్స్ ఉంటుంది.
సరైన వేదిక కోసం ఎదురు చూపు:
థియేట్రికల్ రిలీజ్ పరంగా కలిసొస్తుంది. భారీ పబ్లిసిటీతో జనాల్లోకి సినిమా బలంగా వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కానీ అగ్ర బ్యానర్లేవి ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఓ గిరి గీసుకునే ఆ మధ్యలోనే తిరుగుతున్నాయి తప్ప! నవతరం వైపు అడుగులు వేయడం లేదు. నేటి జనరేషన్ ప్రతిభావంతులకు సరైన వేదిక దొరికితే ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలే `లిటిల్ హార్స్ట్` అనే చిన్న సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో నటించింది అంతా కొత్త వారే. ఒకటి రెండు చిన్న చిత్రాలు చేసిన వారే.
కంటెంట్ కోసం నిర్మాత దిగొస్తే:
ఆ సినిమా నిర్మాత కూడా ఓ దర్శకుడే. తనకున్న ఫరిదిలోనే ఆ సినిమా నిర్మించి ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఆ సినిమా దర్శకుడు కొత్తవాడే. ఇలాంటి ప్రతిభావంతులు పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారి ప్రతిభను నిరూపించుకునే సరైన అవకాశమే దక్కడం లేదు. రాక రాక ఛాన్స్ వచ్చినా కొన్ని ప్రాజెక్ట్ లు బడ్జెట్ కారణంగా మొదలై మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఒకవేళ పూర్తిచేసి రిలీజ్ చేసినా క్వాలిటీ లోపం కారణంగా జనాల కు రీచ్ అవ్వడం లేదు. ఒకప్పుడు చిన్న సినిమా అంటే చిన్న చూపు ఉండేది. కానీ నేడు ట్రెండ్ మారింది. కొత్త వాళ్లే రికార్డు వసూళ్లు సాధిస్తున్నారు. అలాంటి వారి వైపు పెద్దోళ్లు కూడా ఓ చూపు చూస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది.
