Begin typing your search above and press return to search.

ఫ్రీడమ్ ఉంది.. కానీ మరీ ఓవర్?

ఒక సినిమా విడుదలైనప్పుడు కథ ఎలా ఉంది, నటీనటులు ఎలా చేశారు, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనే విషయాలపై ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.

By:  M Prashanth   |   24 Oct 2026 11:47 AM IST
ఫ్రీడమ్ ఉంది.. కానీ మరీ ఓవర్?
X

ఒక సినిమా నచ్చకపోతే విమర్శించొచ్చు. నచ్చితే ప్రశంసించొచ్చు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేక్షకులకు ఆ ఫ్రీడమ్ మరింత పెరిగింది. తమ అభిప్రాయాలను అందరితో షేర్ చేసుకోవచ్చు. మీమ్స్ వేయొచ్చు. నచ్చని సీన్స్ పై సరదాగా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఇదే పనిగా ఒక సినిమాను, దాన్ని తీసిన వాళ్లను టార్గెట్ చేస్తే మాత్రం సమస్యే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక సినిమా విడుదలైనప్పుడు కథ ఎలా ఉంది, నటీనటులు ఎలా చేశారు, దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనే విషయాలపై ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. సినిమా బాగోలేకపోతే అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అయితే, ఇప్పుడు కొన్ని సినిమాల విషయంలో ఆ డిబేట్ విడుదలైన కొద్ది రోజులకే ఆగిపోవడం లేదు. వారాలు, నెలలు గడిచినా అదే సినిమాపై మీమ్స్, ట్రోల్స్ కనిపిస్తూనే ఉంటున్నాయి.

ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో విమర్శలు మొదలవుతున్నాయి. ఏదొక ఎలిమెంట్ తీసుకుని మీమ్స్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా విడుదలైతే థియేటర్లలో చూసినప్పుడు పెద్దగా పట్టించుకోని విషయాలను కూడా మళ్లీ వెతికి మరీ బయటకు తీస్తున్నారు. వాటిని మీమ్స్‌ గా మార్చి వైరల్ చేస్తున్నారు.

దీంతో సినిమా విడుదలైన సమయంలో వచ్చిన విమర్శల కంటే, ఓటీటీ తర్వాత వచ్చే ట్రోల్స్ ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. అయితే సినిమా గురించి చర్చ జరగడం వేరు.. అదే సినిమాను పదేపదే ఎగతాళి చేయడం వేరు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రోల్స్ అనేవి కేవలం ఫ్లాప్ సినిమాలకే పరిమితం కావడం లేదు. మంచి విజయం సాధించిన సినిమాలను కూడా కొందరు వదలడం లేదు.

దీంతో ఏ మూవీ వచ్చినా దానిలో తప్పులు వెతకడమే కొందరి పనిగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే ఆ విషయాన్ని చెప్పే రైట్ ఉంది. దర్శకులు తీసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు. విమర్శలు కూడా యూజ్ అవుతాయి మేకర్స్ కు. కానీ, విమర్శలో ఒక విషయం గురించి మాట్లాడతారు. ట్రోలింగ్‌ లో మాత్రం అదే విషయాన్ని పదేపదే చూపిస్తూ టీజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి సినిమా తీయడం వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. ఆ ప్రయత్నంలో తప్పులు జరగొచ్చు. ఫలితం ఆశించినట్లు రాకపోవచ్చు. అలాంటి సమయంలో లోపాలను ఎత్తిచూపడం తప్పు కాదు. కానీ, ఒక సినిమా రిజల్ట్ పట్టుకుని దాని వెనుక ఉన్న వ్యక్తులను నాన్ స్టాప్ గా టీజ్ చేయడం ఎలాంటి యూజ్ లేదు. అందుకే సోషల్ మీడియా ఇచ్చిన ఫ్రీడమ్ ఎవరూ వద్దనడం లేదు. అయితే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ప్రతి సినిమాను ట్రోల్స్‌ తోనే చూడటం, ఒకసారి మొదలైన ట్రోల్స్ ను నెలల తరబడి కొనసాగించడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఫ్రీడమ్ ఉంది కదా అని మరీ లిమిట్స్ దాటితే, విమర్శకు ట్రోలింగ్‌ కు మధ్య తేడానే కనిపించకుండా పోతుంది.