Begin typing your search above and press return to search.

చివరి నిమిషం ఆలస్యం ఎంతవరకు కరెక్ట్‌?

సినిమాల చివరి నిమిషం వాయిదాలు నిర్మాతలకు, ఇతర చిత్రాలకు నష్టాలు కలిగిస్తున్నాయి. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా తర్వాత శర్వానంద్ ‘భోగి’, రష్మిక మందన్న ‘మైసా’ కూడా విడుదల తేదీలను మార్చుకున్నాయి. ముఖ్యంగా ‘మైసా’ వాయిదాకు వీఎఫ్ఎక్స్ పనులు, సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నిర్ణయాలు సినిమాల ప్రమోషన్, ప్రేక్షకుల్లో ఉన్న బజ్‌పై ప్రభావం చూపుతున్నాయి.

By:  Ramesh Palla   |   23 Nov 2026 12:32 PM IST
చివరి నిమిషం ఆలస్యం ఎంతవరకు కరెక్ట్‌?
X

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదర్శకుటుంబం' సినిమా అక్టోబర్‌ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడి అక్టోబర్‌ చివరి వారంలో విడుదల అయిన విషయం తెల్సిందే. విడుదలకు అంతా రెడీ అంటూ వారం పది రోజుల పాటు తెగ హడావిడి చేసి, ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించి, పబ్లిసిటీ కోసం ఇంటర్వ్యూలు, టాక్‌ షో లు చేసి చివరకు కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నామంటూ నిర్మాత ప్రకటించాడు. ప్రేక్షకులకు బెస్ట్‌ ఔట్‌ పుట్ ఇవ్వడం కోసం అంటూ నిర్మాత ప్రకటించి సినిమా వాయిదా వేయడంతో ఆ వారం మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక సినిమాను విడుదల చేయాలి అనుకుంటే మరికొన్ని సినిమా డేట్ విషయంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాయి. అయితే చివరి నిమిషంలో వాయిదా వల్ల ఇతర సినిమాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదర్శ కుటుంబం వాయిదా వల్ల...

ఆదర్శ కుటుంబం సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేయడం వల్ల చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఇబ్బంది కలిగిందని, అందుకు క్షమించాలంటూ స్వయంగా నిర్మాత ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. చివరి నిమిషంలో సినిమాను విడుదల చేయడం వల్ల ఆ వారం బాక్సాఫీస్‌ వసూళ్లు నష్టపోయినట్లే అని బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఆ వారం ఇతర సినిమాలు వచ్చి ఉంటే ఆ కలెక్షన్స్ కనీసం ఆ సినిమాలకు అయినా దక్కేవి కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సినిమాల వసూళ్ల విషయంలోనూ చివరి నిమిషం ఆలస్యం అనేది ప్రభావం చూపిస్తుంది. ఆదర్శ కుటుంబం వల్ల చాలా పెద్ద నష్టం జరిగినప్పటికీ నిర్మాతలు మాత్రం అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇటీవల శర్వానంద్‌ హీరోగా నటించిన భోగి సినిమా వాయిదా పడగా, తాజాగా రష్మిక మందన్న మైసా సినిమా సైతం వాయిదా పడింది.

శర్వానంద్‌ భోగి సినిమాతో...

శర్వానంద్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన భోగి సినిమాను చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన భోగి సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా వాయిదా పడ్డప్పటికీ కచ్చితంగా మంచి కంటెంట్‌తో రాబోతున్నామని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ చూస్తూ ఉంటే దర్శకుడు సంపత్‌ నంది కచ్చితంగా భోగి సినిమాతో శర్వానంద్‌లోని పూర్తి ప్రతిభను వెలికి తీసినట్లుగా అనిపిస్తుంది. కాస్త రస్టిక్‌గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించే ఎమోషన్‌ సీన్స్ ఉంటాయని అనిపిస్తుంది. సినిమాకు పాజిటివ్‌ బజ్ ఉన్న సమయంలో విడుదల వాయిదా పడటం వల్ల ఇప్పుడు కాస్త బజ్‌ తగ్గిందనే టాక్‌ వినిపిస్తుంది. అయితే విడుదలైన తర్వాత పాజిటివ్‌ టాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రష్మిక మందన్న మైసా సినిమా వాయిదా...

ఇక రష్మిక మందన్న అభిమానులతో పాటు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ మైసా. ఈ సినిమాలో రష్మిక చేసిన పోరాట సన్నివేశాలు, రాములమ్మ పాట అన్ని కూడా మైసా పై ఆసక్తిని పెంచాయి. తీరా చూస్తే సినిమాను వాయిదా వేసినట్లుగా ప్రకటన వచ్చింది. అయితే సినిమాను మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. చిత్రం చివరి నిమిషంలో వాయిదాకు కారణం ఏంటీ అనే విషయానికి వస్తే వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ పూర్తి కాకపోవడం, సెన్సార్‌ ఫార్మాల్టీస్‌ కాకపోవడం కావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని సార్లు బిజినెస్‌, కొన్ని సార్లు ఆర్థిక లావాదేవీల వల్ల కూడా సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలకు విడుదలకు మూడు నాలుగు వారాల ముందు సినిమాను పంపించాల్సి ఉంది. అలా జరగక పోతే సినిమా వాయిదా పడాల్సిందే. చివరి నిమిషంలో వాయిదా వల్ల ప్రమోషన్‌ చేసి వేస్ట్‌, బజ్‌ తగ్గుతుంది. కనుక ఇక ముందు అయినా ఇలా లాస్ట్‌ మినిట్‌ పోస్ట్‌ పోన్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇతర ఫిల్మ్‌ మేకర్స్ కి ఉంది.