Begin typing your search above and press return to search.

మాస్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చిన పవర్‌ఫుల్ పాత్రలు!

ఒకప్పుడు కథానాయకుడి పాత్ర అంటే ఆదర్శవంతమైన వ్యక్తిగానే హైలైట్ అయ్యేది. కానీ కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి.

By:  Srikanth Kontham   |   13 May 2026 6:00 PM IST
మాస్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చిన పవర్‌ఫుల్ పాత్రలు!
X

ఒకప్పుడు కథానాయకుడి పాత్ర అంటే ఆదర్శవంతమైన వ్యక్తిగానే హైలైట్ అయ్యేది. కానీ కాలక్రమేణా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. హీరోలు నీతి, నీతిగా ఉండటమే కాకుండా? తెరపై నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తే ఆ కిక్కే వేరని కొన్ని చిత్రాల విజ‌యాలు నిరూపించాయి. దీంతో టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఒకసారైనా నెగిటివ్ రోల్ తోనే హీరోయిజాన్ని పండించే ప్ర‌య‌త్నం వేగ‌వంత‌మైంది. దీంతో న‌టుల్లోకొత్త కోణాన్ని ఆవిష్కరిం చేందుకు ఈ త‌ర‌హా రోల్స్ ఓ వేదికగా మారుతున్నాయి. టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేసిన ఘనత పూరీ జగన్నాథ్ - మహేష్ బాబుల `పోకిరి`కి దక్కుతుంది.

అంతకు ముందు రౌడీయిజం అంటే గొడవలు అనుకునే వారు. కానీ `పొకిరి`లో పండుగాడు పాత్రతో గ్యాంగ్‌స్టరిజంలో ఒక స్టైల్ ఉంటుందని మహేష్ నిరూపించారు. అటుపై పవన్ కళ్యాణ్ `పంజా`, ప్రభాస్ `ఏక్ నిరంజన్` వంటి చిత్రాల్లో తరహా పాత్రల్లో కనిపించి అలరించారు. హీరోలు మాస్ డైలాగులు చెబుతూ ప్రత్యర్థులను వేటాడే క్రమంలో వచ్చే ఎలివేషన్లు థియేటర్లలో విజిల్స్ వేయించాయి. గ్యాంగ్‌స్టర్ పాత్రలు వినోదానికే పరిమితం కాకుండా నటుడి కెరీర్ గ్రాఫ్‌ను కూడా మార్చేస్తాయి. అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలో స్మగ్లర్‌గా చేసిన నటన ఆయనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.

ఒక సాధారణ వ్యక్తి అక్రమ మార్గంలో డాన్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ఇలాంటి పాత్రల్లో ఉన్న రా ,రస్టిక్ నేచర్ నటులకు సహజ సిద్ధమైన నటనను ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. అందుకే నేటి తరం యువ హీరోలు కూడా ఇలాంటి గ్రిప్పింగ్ డ్రామాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రాబోతున్న పెద్ద సినిమాల్లో కూడా గ్యాంగ్‌స్టర్ నేపథ్యమే కనిపిస్తోంది. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తదుపరి చిత్రాల్లో కొంత నెగటివ్ టచ్ ఉన్న గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్యాంగ్‌స్టర్ అంటే చంపడం మాత్రమే కాదు. వారి వెనుక ఉండే ఎమోషన్, లక్ష్యం వంటి అంశాలను దర్శకులు ఇప్పుడు బలంగా చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఆ పాత్రలకు సులభంగా కనెక్ట్ అవుతున్నారు. అలాగే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో సాంకేతికత కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమా టోగ్రఫీ పాత్రల ఇమేజ్‌ను స్క్రీన్ మీద పదింతలు పెంచుతాయి. రక్తం చిందించే సన్నివేశాల కంటే కూడా హీరో నడిచి వచ్చే స్టైల్, సిగరెట్ వెలిగించే విధానం వంటి చిన్న చిన్న అంశాలను కూడా దర్శకులు ఎంతో స్టైలిష్‌గా చిత్రీకరిస్తున్నారు.

దీంతో గ్యాంగ్‌స్టర్ మూవీ అనేది ఓ జానర్‌గా కాకుండా ఒక బ్రాండ్‌గా మారిపోయింది. తెలుగు సినిమాల్లో గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. హీరో ఎంత విలక్షణంగా? ఎంత పవర్‌ఫుల్‌గా ఆ పాత్రను పండిస్తే సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది. భవిష్య‌త్ లో మరిన్ని వైవిధ్యమైన గ్యాంగ్‌స్టర్ కథలతో టాలీవుడ్ హీరోలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఖాయం.