Begin typing your search above and press return to search.

తిట్టే నాన్నలకే ఇప్పుడు మంచి డిమాండ్!

తెలుగు సినిమాలో నాన్న పాత్ర అంటే ఒకప్పుడు హీరోకు నాలుగు మంచి మాటలు చెప్పడం, చివర్లో ఒక ఎమోషనల్ సీన్ ఇవ్వడం ఎక్కువగా కనిపించేది.

By:  M Prashanth   |   5 Sept 2026 11:26 AM IST
తిట్టే నాన్నలకే ఇప్పుడు మంచి డిమాండ్!
X

తెలుగు సినిమాలో నాన్న పాత్ర అంటే ఒకప్పుడు హీరోకు నాలుగు మంచి మాటలు చెప్పడం, చివర్లో ఒక ఎమోషనల్ సీన్ ఇవ్వడం ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు యూత్ సినిమాల్లో నాన్నకు కూడా మంచి కామెడీ ట్రాక్ పడుతోంది. కొడుకు చదవడు, మాట వినడు, డబ్బులు కావాలంటాడు. ఇవన్నీ చూస్తూ లోపల ప్రేమ ఉన్నా బయట మాత్రం తిట్టే తండ్రి క్యారెక్టర్లు బాగా వర్కవుట్ అవుతున్నాయి.

దీనికి ‘నైంటీస్’ కంటే ముందు మరికొన్ని క్యారెక్టర్లు బాగా హైలెట్ అయ్యాయి. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో గోపరాజు రమణ చేసిన కొండలరావు పాత్ర అప్పుడే బాగా గుర్తుండిపోయింది. కొడుకు హోటల్ పెడతానంటే మొదటి నుంచి గొడవ. ఏ విషయం అయినా మొహం మీదే చెప్పడం. ఆనంద్ దేవరకొండతో ఆయన సీన్లు సినిమాలో మంచి కామెడీ ఇచ్చాయి. ఆ తండ్రి ప్రేమ కూడా మాటల్లో కాకుండా పనుల్లోనే కనిపిస్తుంది.

‘నైంటీస్’ వచ్చాక మాత్రం ఈ రకం నాన్న క్యారెక్టర్ ఇంటింటికీ వెళ్లిపోయింది. శివాజీ చేసిన చంద్రశేఖర్ మాస్టర్‌కు పిల్లల మార్కులు, ఇంటి ఖర్చులు, చదువు అన్నీ ఒకటే టెన్షన్. వందకు తొంభై తొమ్మిది వచ్చినా ఎందుకు ఒక మార్కు పోయిందని అడిగే తండ్రి. పిల్లల ముందు పొగడడు. వాళ్లు బాగా చేస్తే మాత్రం లోపల గర్వపడతాడు. అందుకే ఆ పాత్రలో చాలామందికి తమ ఇంట్లో నాన్న కనిపించాడు.

గతేడాది ‘లిటిల్ హార్ట్స్’లో రాజీవ్ కనకాల పాత్ర కూడా ఇదే ఏరియాలో మంచి కామెడీ ఇచ్చింది. కొడుకు అఖిల్‌ను ఎలాగైనా ఇంజనీర్ చేయాలనుకునే తండ్రి. కానీ వాడికి చదువు పెద్దగా ఎక్కదు. ఎంసెట్ కూడా క్వాలిఫై కాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్‌లో పడేస్తాడు. కొడుకును తిడుతూ ఉండే సీన్లలోనే ఆ ఇంటి కథ కూడా బయటపడుతుంది.

‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో మాత్రం లెక్కను రివర్స్ చేశారు. అక్కడ రావు రమేష్ తండ్రి అయినా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తే ఇంట్లో సమస్యలు తెచ్చుకుంటాడు. కొడుకుతో ఆయన సీన్లు అందుకే మరో రకం ఫన్ ఇచ్చాయి. అంటే ఇప్పుడు నాన్న పాత్ర తప్పనిసరిగా ఇంట్లో నీతులు చెప్పే పెద్దమనిషిగానే ఉండాల్సిన పని లేదు. వాడికీ తప్పులు, చిరాకు, చిన్న చిన్న కోరికలు ఉండొచ్చు.

ఇప్పుడు ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’తో చంద్రశేఖర్ మాస్టర్ మళ్లీ వస్తున్నాడు. ‘నైంటీస్’లో చిన్న పిల్లాడిగా ఉన్న ఆదిత్య ఇప్పుడు ఆనంద్ దేవరకొండగా పెద్దవాడయ్యాడు. శివాజీ, వాసుకి మాత్రం అదే అమ్మానాన్నలుగా కొనసాగుతున్నారు. చిన్నప్పుడు మార్కుల కోసం కొడుకును వెంటపడిన చంద్రశేఖర్ మాస్టర్, ఇప్పుడు లండన్ వెళ్లిన కొడుకుతో ఎలా ఉంటాడన్నది కూడా ‘ఎపిక్’లో చూడాల్సిన మంచి పాయింటే.