యాసల మీద కొట్టేసుకుంటున్నారు
ఐతే రెగ్యులర్ సినీ అభిమానులకు.. రాజకీయ ఉద్దేశాలున్న వాళ్లు కూడా తోడై ఈ ఫ్యాన్ వార్ సంస్కృతిని మరింత పెంచి పోషిస్తున్నారు.
By: Garuda Media | 31 Aug 2026 5:25 PM ISTకాదేదీ ఫ్యాన్ వార్స్‌కు అనర్హం అన్నట్లుగా తెలుగు సినీ జనాలు.. సోషల్ మీడియాలో రోజుకో కొత్త కారణంతో కొట్టేసుకుంటూ ఉంటారు. ఐతే రెగ్యులర్ సినీ అభిమానులకు.. రాజకీయ ఉద్దేశాలున్న వాళ్లు కూడా తోడై ఈ ఫ్యాన్ వార్ సంస్కృతిని మరింత పెంచి పోషిస్తున్నారు. ఈ మధ్య సినిమాల్లో ఉపయోగించే మాండలికాలు, యాసల మీద కూడా అదే పనిగా కొట్టేసుకుంటున్నారు తెలుగు నెటిజన్లు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన 12 ఏళ్ల తర్వాత కొందరు రాజకీయ ప్రయోజనాలు ఆశించి ప్రాంతీయ వాదంతో గొడవలు రాజేస్తుండగా.. సినిమాలతోనూ ముడిపెట్టి ఆ గొడవలకు ఆజ్యం పోసే ప్రయత్నం జరుగుతోంది. కొన్ని నెలల కిందట ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ మీద ఎవరో ఊరూ పేరు లేని ఆంధ్ర వ్యక్తి నెగెటివ్ కామెంట్ చేస్తే.. అది పెద్ద వివాదంగా మారింది. కొన్ని రోజుల పాటు ఆ గొడవ నడిచింది.
కానీ తర్వాత కూడా ఈ తరహా వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా నాని సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి రిలీజ్ చేసిన ‘యేషనాగుల కట్ట’ పాటలో సాహిత్యం మీద కొందరు ఆంధ్రా వాళ్లు కామెంట్లు చేస్తే.. తెలంగాణ వాళ్లు గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలోనే ఘర్షణ నడుస్తోంది. తెలంగాణలో సినిమాలు చేసుకుంటూ, ఇక్కడి కలెక్షన్లు తీసుకుంటూ తెలంగాణ భాష, యాస, సంస్కృతి మీద సినిమాలు తీస్తే తట్టుకోలేరా అంటూ ఈ ప్రాంత వాసులు వాదిస్తూనే కొన్ని అభ్యంతరకర కామెంట్లు చేస్తుండగా.. అవతలి వర్గం తమ భాష, యాసను తక్కువ చేసి మాట్లాడతారా అంటూ వాదనకు దిగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల సన్నివేశాలకు ఇరు ప్రాంతాల యాసలను జోడించి.. అవతలి వాళ్ల భాష-యాసలను కించపరిచే ప్రయత్నం జరుగుతోంది. రోజుల తరబడి ఈ విషయం మీద కొట్టేసుకుంటూ పరస్పరం కవ్వించుకుంటూ దీన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నారు. దీన్ని రాజకీయ అంశంగానూ మారుస్తూ కొందరు చలికాచుకుంటుండడం గమనార్హం.
