Begin typing your search above and press return to search.

మారుతోన్న‌ కమర్షియల్ సినిమా ఫార్మాట్!

కానీ నేడు కథలో దమ్ముండి ప్రేక్షకుడిని భావోద్వేగంగా కనెక్ట్ చేయగలిగితే.. నిడివి మూడు నుండి నాలుగు గంటలు ఉన్నా థియేటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు.

By:  Srikanth Kontham   |   24 Jun 2026 4:00 AM IST
మారుతోన్న‌ కమర్షియల్ సినిమా ఫార్మాట్!
X

ఒకప్పుడు కమర్షియల్ సినిమా అనే మాటకి పక్కా కొలతలుండేవి. ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు .. కామెడీ ట్రాక్ ఉండాల్సిందే అనే నియమం బ‌లంగా ఉండేది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీ ఇదే రూల్ ఫాలో అయింది. కథ ఎలా ఉన్నా? కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కుదిరితే సినిమా కనీస వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పాత ఫార్ములాను నమ్ముకుంటే ప్రేక్షకులు థియేటర్ల వైపు కూడా చూడటం లేదు.దశాబ్ద కాలంలో నయా జనరేషన్ దర్శకులు పాత టెంప్లేట్‌ను పూర్తిగా మార్చేసారు.

కథనంలో వేగం తగ్గకూడదని.. ప్రేక్షకుడు కథ నుంచి పక్కకు మళ్లకూడదని భావిస్తే ఏకంగా పాటలు లేకుండానే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఒకవేళ పాటలు ఉన్నా? అవి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూపంలో కథను ముందుకు నడిపించేవిగా మారుతున్నాయి తప్ప హీరో హీరోయిన్ల డ్యూయెట్ల కోసం కథను ఆపే సంస్కృతికి మెల్లగా తెరపడుతోంది. సినిమా నిడివి విషయంలో కూడా ద‌ర్శ‌కుల‌ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రెండున్నర గంటల లోపు సినిమా ముగించాలి అనే కండీష‌న్ ఉండేది . అంతకంటే ఎక్కువ ఉంటే ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడని భావించేవారు.

కానీ నేడు కథలో దమ్ముండి ప్రేక్షకుడిని భావోద్వేగంగా కనెక్ట్ చేయగలిగితే.. నిడివి మూడు నుండి నాలుగు గంటలు ఉన్నా థియేటర్లలో బ్రహ్మరథం పడుతున్నారు. కథను సాగదీయకుండా ప్రతి నిమిషం ఉత్కంఠను రేకెత్తిస్తే రన్‌టైమ్ అనేది సమస్యే కాదని ఇటీవలి భారీ విజయాలు నిరూపించాయి. మరో ఆసక్తికర మార్పు ఏంటంటే? కథను ఒకే భాగంలో ముగించాల‌నే రూల్ ఇప్పుడు లేదు. `బాహుబలి`, `పుష్ప`, `సలార్` లాంటి చిత్రాల విజయాలతో తెలుగు సినిమా ఫ్రాంచైజీ...సీక్వెల్స్ యుగంలోకి అడుగుపెట్టింది. కథను విస్తృతంగా చెప్పడానికి పాత్రలను బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకులు కథను రెండు, మూడు భాగాలుగా విభజిస్తున్నారు.

ఇది సృజనాత్మక పరంగానే కాకుండా వ్యాపారపరంగా కూడా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టే సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్‌గా మారింది. ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచి మారడమే. ఓటీటీల విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా విభిన్న కంటెంట్‌ను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. దీంతో లాజిక్ లేని ఫైట్లు, బలవంతపు కామెడీ ట్రాక్‌లను ప్రేక్ష‌కులు నిర్మొహ మాటంగా తిరస్కరిస్తున్నారు. హీరో ఇమేజ్ కంటే కథలోని బలం, పాత్రల డిజైనింగ్, మేకింగ్ లార్జర్ దాన్ లైఫ్ అనుభూతిని ఇస్తేనే థియేటర్లకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.

నేటి కమర్షియల్ సినిమా పరిధి కొన్ని ఫైట్లు, పాటలకే పరిమితం కాకుండా విస్తృతమైంది. నయా ట్రెండ్ దర్శకులు పాత చట్రాన్ని దాటి కొత్త ప్రయోగాలు చేస్తుండటం ఇండస్ట్రీకి సరికొత్త ఊపిరినిస్తోంది. వ్యాపార సూత్రాలు మారనిప్పటికీ ఆ వ్యాపారాన్ని సాధించే మార్గం మాత్రం రొటీన్ ఫార్ములా నుండి కంటెంట్ బేస్డ్ సినిమా వైపు మళ్లడం తెలుగు సినిమా ఎదుగుదలకు శుభసూచకంగా చెప్పొచ్చు.