సెన్సార్ క్లియర్ అవ్వాలంటే.. పెద్దోళ్లు ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?
సినిమా పూర్తి చేయడం ఒక ఎత్తు.. దాన్ని అనుకున్నట్లు రిలీజ్ చేయడం మరో ఎత్తు.
By: M Prashanth | 11 Oct 2026 11:59 AM ISTసినిమా పూర్తి చేయడం ఒక ఎత్తు.. దాన్ని అనుకున్నట్లు రిలీజ్ చేయడం మరో ఎత్తు. ముఖ్యంగా చిన్న సినిమాలకు సెన్సార్ దగ్గర ఎదురయ్యే సమస్యలు ఇప్పుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక సెన్సార్ దగ్గర అభ్యంతరాలు వస్తే ఏం చేయాలి.. వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. ఈలోగా రిలీజ్ డేట్ మారితే పరిస్థితి ఏంటి.. ఇలాంటి ప్రశ్నలు నిర్మాతలను వెంటాడుతున్నాయి.
రీసెంట్ గా శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. దీంతో సెన్సార్ ప్రక్రియపై చర్చ మొదలైంది. శుక్రవారం విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాకు విడుదలకు ముందు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మూవీ టీమ్ ఢిల్లీలోని రివైజింగ్ కమిటీ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి సాయం చేసినట్లు సినిమా ప్రెజెంటర్ కోన వెంకట్ తెలిపారు. చిరంజీవి స్పందించిన తర్వాత సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యేందని చెప్పారు.
దీంతో ఒక సినిమా విడుదలకు సెన్సార్ ఎంత ముఖ్యమో, అక్కడ సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవడం ఎంత కష్టమో మరోసారి చర్చకు వచ్చింది. సినిమాలో ఏ సీన్లు ఉండాలి, ఏవి ఉండకూడదనే విషయంలో సెన్సార్ బోర్డుకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటికి తగ్గట్లు సినిమాను పరిశీలించడం అవసరమే. అభ్యంతరాలు ఉంటే మార్పులు చెప్పడం కూడా అందులో భాగమే. కానీ వాటిని క్లియర్ గా చెప్పడం చాలా మెయిన్.
అప్పుడే నిర్మాతలు సమస్యను క్లియర్ చేసుకుంటారు. అయితే సెన్సార్ దగ్గర అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కువ సమయం పడితే రిలీజ్ ప్లాన్ పై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ ను ముందుగానే ప్రకటించిన సినిమాలకు ఆ ఇబ్బంది ఎక్కువ. థియేటర్లు ఫిక్స్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం.. ఇవన్నీ ముందుగానే జరుగుతాయి. చివరి నిమిషంలో సెన్సార్ పూర్తికాకపోతే నిర్మాతలు ఆందోళన చెందాల్సి వస్తుంది.
సెన్సార్ విషయంలో ప్రతి సినిమాకు ఒకేలాంటి రూల్స్ ఉండాలి. ఒక సినిమాకు అభ్యంతరం చెప్పినప్పుడు, అదే తరహా సీన్స్ ఉన్న మరో మూవీని ఎలా పరిశీలించారనే విషయంలో క్లారిటీ ఉండాలి. సినిమాను బట్టి నిబంధనలు మారుతున్నాయనే అనుమానాలు రాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అబ్జెక్షన్స్ ఉంటే వాటిని ఒకేసారి చెప్తే నిర్మాతలు పదేపదే తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. సమస్యలు వచ్చినప్పుడు రివైజింగ్ కమిటీని సంప్రదించే అవకాశం ఉండటం మంచిదగే.
కానీ అక్కడికి వెళ్లడం, నిర్ణయం కోసం వెయిట్ చేయడం వల్ల రిలీజ్ లేట్ కాకుండా చూడాలి. అప్పుడే నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను నమ్మకంగా ప్రకటించుకోగలుగుతారు. చిరంజీవి వంటి నటులు స్పందిస్తే ఒక సినిమాకు సాయం అందవచ్చు. కానీ ప్రతి చిన్న మూవీకి అలాంటి హెల్ప్ అందుతుందని చెప్పలేం. అందుకే సెన్సార్ డిపార్టమెంటే వేగంగా పనిచేయాలి. సన్నివేశాలపై అభ్యంతరాలు చెప్పొచ్చు. కానీ సరైన కారణం లేకుండా సినిమాల విడుదల ఆలస్యం కాకుండా చూడాలి. సెన్సార్ ప్రక్రియలో క్లారిటీ, స్పీడ్ ఉంటేనే చిన్న సినిమాల నిర్మాతలకు చివరి నిమిషం టెన్షన్ తగ్గుతుంది.
