ఆడియన్స్ మారారు.. మేకర్స్ ఇంకా భయపడుతున్నారా?
తెలుగు సినిమా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో ఈమధ్య పెద్ద మార్పే కనిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములా కథల కంటే డార్క్ షేడ్స్ ఉండే బోల్డ్ అటెంప్ట్స్ వైపే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
By: M Prashanth | 13 Aug 2026 9:43 AM ISTతెలుగు సినిమా ప్రేక్షకుల ఆలోచనా విధానంలో ఈమధ్య పెద్ద మార్పే కనిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములా కథల కంటే డార్క్ షేడ్స్ ఉండే బోల్డ్ అటెంప్ట్స్ వైపే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే చాలు ప్రయోగాలనైనా ఆదరించేందుకు రెడీగా ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం పబ్లిక్ ఆక్సెప్ట్ చేయరేమోననే భయంతోనే ఇంకా సేఫ్ రూట్ వెతుక్కుంటున్నారా అనే సందేహం కలుగుతోంది.
నటి కామాక్షి భాస్కర్ల రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఈ పాయింట్ నే హైలైట్ చేస్తున్నాయి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన '12A రైల్వే కాలనీ' థియేటర్లలో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒరిజినల్ కథలో హీరో హీరోయిన్ల మధ్య బ్రదర్ సిస్టర్ యాంగిల్ లో ఒక బోల్డ్ ట్విస్ట్ రాసుకున్నారట. పాటలు కూడా లేకుండా అథెంటిక్ గా స్క్రిప్ట్ డిజైన్ చేశారని ఆమె చెప్పారు.
కానీ షూటింగ్ టైమ్ లో రకరకాల మార్పులు చేసి, తెరపైకి వచ్చేసరికి సినిమా రూపురేఖలు మార్చేశారు. ఈ ఒక్క సినిమానే కాదు, చాలామంది రైటర్లు అద్భుతమైన ఐడియాలతో కథలు రాసుకుంటారు. ప్రొడక్షన్ స్టేజ్ కి వచ్చేసరికి ఆడియన్స్ కి కనెక్ట్ కాదేమోనన్న డౌట్ తో కథలో అసలైన సోల్ ని పక్కన పెట్టేస్తుంటారు. సేఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల ఒరిజినల్ ఐడియాకి ఉన్న ఇంటెన్సిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవలం కథలో బోల్డ్ ట్విస్టులు లేదా డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా వర్కౌట్ అయిపోదు. పేపర్ మీద ఎంత గొప్ప పాయింట్ ఉన్నా, దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసే విధానం సరిగ్గా లేకపోతే ఆడియన్స్ అస్సలు కనికరించరు. ప్రయోగాలతో పాటు ప్రాపర్ టేకింగ్ కూడా తోడైనప్పుడే ఆ కొత్తదనం బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది.
ఇప్పుడున్న ఆడియన్స్ కొత్తదనం ఉన్న కథలకు కూడా మంచి రియాక్షన్స్ ఇస్తున్నారు. అందుకే ప్రతి డిఫరెంట్ ఐడియాను ముందే సేఫ్ జోన్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న వస్తోంది. అవసరమైన మార్పులు చేయడంలో తప్పు లేదు. కానీ కేవలం బిజినెస్ లెక్కల కోసం కథకు ఉన్న అసలు ఫ్లేవర్ నే మార్చేస్తే సమస్య మొదలవుతుంది. లేదంటే చేతిలో మంచి కథ ఉన్నా దాని ప్రత్యేకతే పోయే ప్రమాదం ఉంటుంది.
12A రైల్వే కాలనీ ఒరిజినల్ వర్షన్ అలానే ఉంటే హిట్ అయిపోయేదా అనేది పక్కన పెడితే, కామాక్షి భాస్కర్ల చెప్పిన మాటలు మాత్రం ఒక ముఖ్యమైన చర్చకు కారణమయ్యాయి. ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్న సమయంలో, మేకర్స్ ఇంకా పాత ఫార్ములా భయాల నుంచే బయటకు రాకపోతే మంచి ఐడియాలు దారి తప్పే ప్రమాదం ఉంది. ముందుముందు అయినా మన వాళ్లు ఈ సేఫ్ రూట్ వదిలి ధైర్యంగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.
