సంక్రాంతికే కాదు.. క్రిస్మస్ కు కూడా.. గట్టి పోటీ తప్పదా?
2026 సంక్రాంతి ఆరు చిత్రాలు రిలీజ్ అవుతాయని తెలుస్తుండగా.. ఇప్పుడు క్రిస్మస్ కు కూడా అన్నే రానున్నాయట. ఆ ఆరు సినిమాలు కూడా తెలుగువే కావడం విశేషం.
By: M Prashanth | 21 Oct 2025 9:49 AM ISTమొన్న దసరా.. నిన్న దీపావళి అయిపోయింది.. నెక్స్ట్ సంక్రాంతి వచ్చేస్తోంది.. ఇంతలో క్రిస్మస్ పండుగ కూడా రానుంది. దీంతో ఎప్పటిలానే పలు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. 2026 సంక్రాంతి ఆరు చిత్రాలు రిలీజ్ అవుతాయని తెలుస్తుండగా.. ఇప్పుడు క్రిస్మస్ కు కూడా అన్నే రానున్నాయట. ఆ ఆరు సినిమాలు కూడా తెలుగువే కావడం విశేషం.
అయితే అన్నింటికన్నా ముందు యంగ్ అడివి శేష్ డెకాయిట్ మూవీ.. క్రిస్మస్ రిలీజ్ కు కర్చీఫ్ వేసింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నామని మేకర్స్ కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు. కానీ విడుదల డౌటేనని ఇటీవల టాక్ వచ్చింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు.
ఆ తర్వాత సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు, యువ కథానాయకుడు రోషన్ మేక.. హీరోగా నటిస్తున్న మరో మూవీ చాంపియన్ కూడా క్రిస్మస్ కు విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25వ తేదీనే చాంపియన్ కూడా రానుంది.
అదే రోజు మరో యంగ్ హీరో, ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ఆది సాయి కుమార్ నటిస్తున్న శంబాల: ఎ మిస్టిరికల్ వరల్డ్ మూవీ కూడా రిలీజ్ అవ్వనున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు ఉగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక క్రిస్మస్ కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ తో వర్క్ చేస్తున్న ఫంకీ మూవీతో సందడి చేయనున్నట్లు సమాచారం. అనుదీప్ మార్క్ తో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఫంకీ తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 25వ తేదీనే సినిమా రిలీజ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
ఈ నాలుగు సినిమాలతోపాటు మరో రెండు సినిమాలు కూడా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వనున్నాయి. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన పతంగ్ డిసెంబర్ 25న థియేటర్స్ లో రానుంది. స్పోర్ట్స్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో ప్రీతి పగడాల, వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ఎస్ పి చరణ్ కీలక పాత్రల్లో నటించారు.
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన యుఫోరియా క్రిస్మస్ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. సీనియర్ బ్యూటీ భూమిక చావ్లా లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాలో పలువురు యాక్ట్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్ కానుకగా ఒకే తేదీ ఆరు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండనున్నట్లు కనిపిస్తోంది. మరి ఏ సినిమా.. ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
