తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల లెక్కలు.. ఏ సినిమాకు ఎన్ని షోలు పడ్డాయంటే?
ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' రెండో స్థానాన్ని ఆక్రమించడం.
By: M Prashanth | 17 Jan 2026 10:16 AM ISTసంక్రాంతి పండుగ హడావిడి ఇంకా ఫినిష్ కాలేదు. సెలవులు కొనసాగుతుండటంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా, ప్రజాదరణను బట్టి థియేటర్ల కేటాయింపులు మారుతూ ఉంటాయి. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో ఈ రోజు పడిన షోల సంఖ్యను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
సాధారణంగా సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు స్టార్ హీరోల హవా నడుస్తుంది. కానీ ఆ తర్వాత కంటెంట్ బాగున్న సినిమాలకే ఎగ్జిబిటర్లు పట్టం కడతారు. డిమాండ్ ఉన్న సినిమాలకు స్క్రీన్స్ పెంచడం, ఆదరణ తగ్గిన సినిమాలకు కోత విధించడం సహజం. ఈ క్రమంలో ఈ రోజు (జనవరి 17) థియేటర్ల సంఖ్యలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ రోజు ఏకంగా 2217 షోలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మొత్తం ఈ సినిమాకే పడటంతో మెజారిటీ స్క్రీన్స్ దీనికే దక్కాయి.
ఇక అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' రెండో స్థానాన్ని ఆక్రమించడం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 1147 షోలతో భారీ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ 'ది రాజాసాబ్' 926 షోలకు పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. మిక్స్డ్ టాక్ ప్రభావం షోల సంఖ్యపై ఎఫెక్ట్ పడింది.
శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా సూపర్ హిట్ టాక్ తో తనదైన రీతిలో రన్ అవుతూ 622 షోలను దక్కించుకుంది వచ్చే రోజుల్లో దీనికి థియేటర్స్ గట్టిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం 541 షోలతో జాబితాలో చివరి స్థానంలో ఉంది. ఈ రెండు సినిమాలు స్టడీగా కలెక్షన్స్ రాబడుతున్నా, షోల సంఖ్య పరంగా టాప్ మూవీస్ కంటే వెనుకబడి ఉన్నాయి.
ఏదేమైనా ఈ రోజు షో కౌంట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ విన్నర్ ఎవరనేది క్లియర్‌గా తెలిసిపోతోంది. స్టార్ డమ్ కంటే కంటెంట్ కే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నవీన్ పోలిశెట్టి సినిమాకు పెరిగిన షోలే నిదర్శనం. వీకెండ్ ముగిసేనాటికి ఈ లెక్కల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయో వేచి చూడాలి. ఇక ఆదివారం వరకు కలెక్షన్స్ స్టడీగానే ఉండనున్నాయి. ఇక సోమవారం ఎలా ఉంటుందో చూడాలి.
