Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్ థియేటర్లలో వచ్చే సినిమాలివే.. పోటీ ఎలా ఉందంటే..

ఈ వారం థియేటర్ల దగ్గర ఒక్క సినిమా మీదే ఫోకస్ ఉండే పరిస్థితి లేదు. ఆగస్టు 20 నుంచి 22 మధ్య బాక్సాఫీస్ లైనప్ కాస్త బిజీగానే ఉంది.

By:  M Prashanth   |   17 Aug 2026 5:34 PM IST
ఈ వీకెండ్ థియేటర్లలో వచ్చే సినిమాలివే.. పోటీ ఎలా ఉందంటే..
X

ఈ వారం థియేటర్ల దగ్గర ఒక్క సినిమా మీదే ఫోకస్ ఉండే పరిస్థితి లేదు. ఆగస్టు 20 నుంచి 22 మధ్య బాక్సాఫీస్ లైనప్ కాస్త బిజీగానే ఉంది. రవితేజ ఇరుముడి మెయిన్ రిలీజ్ గా వస్తుంటే, దానికి తోడుగా అమీర్ లోగ్, ది రెడ్ బ్యాగ్ లాంటి చిన్న సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ ఒక రోజు ముందే వస్తోంది. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాలు రెండు రీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల దగ్గర సందడి గట్టిగానే ఉండబోతోంది.

ఆగస్టు 21న వస్తున్న ‘ఇరుముడి’ ఈ వారం మెయిన్ అట్రాక్షన్. డైరెక్టర్ శివ నిర్వాణ తీసిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్స్, అయ్యప్ప దీక్ష, ఒక మిస్టరీ ట్రాక్ ఉన్నాయి. ట్రైలర్ గమనిస్తే రవితేజను ఒక రెగ్యులర్ కమర్షియల్ మాస్ హీరోలా కాకుండా నార్మల్ ఫ్యామిలీ మ్యాన్ గా చూపించారు. కంటెంట్ క్లిక్ అయితే ఈ వారం విన్నర్ గా నిలిచే చాన్స్ ఉంది.

అదే రోజున ‘అమీర్ లోగ్’ అనే చిన్న సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. హైదరాబాద్ బస్తీ వాతావరణం, స్నేహితుల మధ్య నాచురల్ హ్యూమర్ తో కట్ చేసిన ట్రైలర్ ఈ సినిమాకు ముందే కొంత గుర్తింపు తెచ్చింది. పెద్ద స్టార్లు లేకపోయినా బస్తీ ప్రపంచాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించబోతున్నారనే ఫీలింగ్ కలిగింది. భారీ ఓపెనింగ్స్ రాకపోయినా, మార్నింగ్ షో తర్వాత వచ్చే టాక్ బాగుంటే వీకెండ్ కు స్క్రీన్స్ పెరిగే అవకాశం ఉంది.

ఇక క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ల కోసం ‘ది రెడ్ బ్యాగ్’ రెడీగా ఉంది. రవి కుమార్ సీరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. అసలు కథేంటో పూర్తిగా చెప్పకుండా టీజర్ లో కేవలం ఒక మిస్టరీని మాత్రమే చూపించారు. ఆ మిస్టరీ సినిమా మొత్తం ఆడియన్స్ ను కూర్చోబెడుతుందా లేదా అన్నది చూడాలి.

వీటన్నింటికంటే ముందు ఆగస్టు 20నే పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ రాబోతోంది. వైశాఖ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లో గోల్డ్ స్మగ్లర్ అమీర్ అలీగా పృథ్వీరాజ్ కనిపిస్తున్నాడు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి మలయాళ వెర్షన్ కే షోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఏ స్థాయిలో రిలీజ్ అవుతుందో చూడాలి.

మరోవైపు పాత సినిమాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 21న ముఠా మేస్త్రీ, 22న శంకర్ దాదా ఎంబీబీఎస్ 4కే వెర్షన్లు చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా వస్తున్నాయి. అదే 21న ‘ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్’ తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ అవుతోంది. ఇలా అన్నీ రాకల జానర్ సినిమాలు ఒకే వీకెండ్ లో ఉన్నాయి. ఇక తొలి రోజు వచ్చే టాక్ ని బట్టే షోలు పెరుగుతాయి. మరి ఈ లైనప్ లో ఎవరు బిగ్ హిట్ అందుకుంటారో చూడాలి.