టైటిల్ చూసి దండం పెట్టేస్తున్నారు
ఒకప్పుడు అనువాద చిత్రాలకు చక్కగా తెలుగు టైటిళ్లు పెట్టేవారు. డబ్బింగ్ కూడా ఎంతో జాగ్రత్తగా చేసేవారు.
By: Garuda Media | 29 April 2026 12:44 PM ISTఒకప్పుడు అనువాద చిత్రాలకు చక్కగా తెలుగు టైటిళ్లు పెట్టేవారు. డబ్బింగ్ కూడా ఎంతో జాగ్రత్తగా చేసేవారు. పాటలు, మాటల కోసం ఇక్కడ ప్రముఖ లిరిసిస్టులు, డైలాగ్ రైటర్లను పెట్టుకునేవారు. ముఖ్యంగా మణిరత్నం, శంకర్ లాంటి తమిళ దర్శకులు డబ్బింగ్ విషయంలో ఎంత జాగ్రత్త పడేవాళ్లో తెలిసిందే. అందువల్లే వాళ్ల సినిమాలు చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగే వచ్చేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. మాటలు, పాటలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే.. కనీసం అచ్చ తెలుగులో ఒక టైటిల్ పెట్టడం కూడా కష్టమైపోతోంది.
అస్సలు అర్థం కాని పరభాషా టైటిళ్లే పెట్టి వదిలేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే ఏ భాషా చిత్రాన్నయినా ఆదరిస్తారన్నది వాస్తవమే కానీ.. అలా అని కనీసం తెలుగు పేరు కూడా పెట్టకుండా రిలీజ్ చేస్తే వేలం వెర్రిగా థియేటర్లకు వచ్చేస్తారు అనుకుంటే పొరపాటే. టైటిల్ వినగానే వ్యతిరేక భావన కలిగి డబ్బింగ్ సినిమాల వైపే చూడట్లేదు. ఈ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అయినా సరే వాళ్లు లైట్ తీసుకుంటున్న పరిస్థితి.
కొన్నేళ్ల ముందు వచ్చిన రజినీ సినిమా ‘వేట్టయాన్’కు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదంటే.. టైటిల్ చూడగానే కలిగిన వ్యతిరేక భావనే కారణం. ఆ టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా సరే.. తమిళ నిర్మాతల తీరు మారలేదు. ధనుస్ సినిమాకు ‘రాయన్’ అనే పేరు పెట్టి వదిలారు. ఇప్పుడు అతడి నుంచే ‘కర’ అనే సినిమా వస్తోంది. ధనుష్ గత ఏడాది ‘కుబేర’తో తెలుగులో హిట్టు కొట్టాడు. తర్వాత ‘ఇడ్లీ కొట్టు’ కూడా ఓ మోస్తరుగా ఆడింది. అయినా సరే ‘కర’కు మినిమం బజ్ కనిపించట్లేదు. అందుకు ప్రధాన కారణం.. టైటిల్ అనడంలో సందేహం లేదు. కరసామి అనే పేరు నుంచి తీసుకున్న టైటిల్ ‘కర’. తెలుగు జనాలకు అస్సలు ఈ టైటిల్ ఎక్కలేదు. ప్రోమోలు చూస్తే సినిమాలో విషయం ఉన్నట్లే ఉంది. కానీ టైటిలేమో అలా ఉండేసరికి మన వాళ్లు కనీసం ప్రోమోలు చూడడానికి కూడా ఆసక్తి ప్రదర్శించట్లేదు.
ఇటీవలే మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘వాలా-2’ సినిమాను తెలుగులోకి తెచ్చారు. అది మంచి సినిమానే. అయినా దాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ చిత్ర నిర్మాతల్లో టాలీవుడ్‌కు చెందిన సాహు గారపాటి కూడా ఉన్నారు. ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు టైటిల్ పెట్టుకోలేకపోయారు. ఈ నెలలోనే ‘పల్లిచట్టంబి’ అంటూ మన వాళ్లకు వికారం కలిగించే టైటిల్‌తో టొవినో థామస్ సినిమాను రిలీజ్ చేశారు. దీనికి రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. కనీసం తెలుగు టైటిల్ కూడా పెట్టకుండా తెలుగు నుంచి కోట్లు కొల్లగొట్టేయాలనుకోవడం ఎంత దారుణం? తెలుగు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ తమ వ్యతిరేకతను చాటుతూనే ఉన్నా సరే.. వీరు మారడం లేదంటే ఏమనాలి?
