షారూఖ్‌కి జాతీయ అవార్డు సరే.. చిరంజీవికి ఎప్పుడు?
ఇటీవలే 2024-25 సంవత్సరానికి జాతీయ అవార్డులను ప్రకటించగా, అందులో రెండు తెలుగు సినిమాలకు జాతీయ పురస్కారాలు దక్కాయి.
By: Srikanth Kontham | 6 Aug 2025 10:04 AM ISTఇటీవలే 2024-25 సంవత్సరానికి జాతీయ అవార్డులను ప్రకటించగా, అందులో రెండు తెలుగు సినిమాలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. కానీ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు లేదా ఏదైనా పెద్ద కేటగిరీలో పురస్కారాలు అయితే రాలేదు. 2023-24 సీజన్‌లో పుష్ప చిత్రంలో అసాధారణ నట ప్రదర్శనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోవడం ఒక సంచలనం. అప్పటివరకూ ఒక తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కించుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచాన్ని నివ్వెరపరిచే విషయం. వందేళ్లు పైబడిన భారతీయ సినిమా చరిత్రలో 90 ఏళ్లుగా తెలుగు సినిమా ఘనచరితను చాటుకుంటూనే ఉంది. ఎన్నో క్లాసిక్స్ ని అందించింది తెలుగు సినీపరిశ్రమ. పరిశ్రమలో సంచలన విజయాలకు కొదవేమీ లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి ప్రముఖ హీరోలను మనం చూశాం. వీరంతా అసాధారణ ప్రతిభా పాటవాలతో దశాబ్ధాల పాటు తెలుగు తెరను ఏలిన వారే. కానీ ఒక్కరికి కూడా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యపరిచింది.
ఎవరికీ ఆసక్తి లేదు:
తరాలు దాటి ముందుకు సాగుతున్నా కానీ కేంద్రంలోని అవార్డుల కమిటీ- జూరీకి తెలుగు సినీపరిశ్రమలో ఉత్తమ నటుడు కనిపించలేదు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే అవార్డులు అనేవి కేవలం రాజకీయాలతో ముడిపడిన అంశం గనుక వీటిపై ఎవరూ అంతగా ఆసక్తిగా లేరు. ఇటీవలి కాలంలో అసలు అవార్డులు ప్రకటించినా తీసుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు కొందరు స్టార్లు.
33 ఏళ్లు ఎదురు చూసిన హీరో:
2024-25 సీజన్ జాతీయ అవార్డుల్లో జవాన్ లో నటనకు గాను, ఉత్తమ నటుడుగా కింగ్ ఖాన్ షారూఖ్ పేరు వినిపించడం కూడా విస్మయపరిచింది. అతడు ట్వల్త్ ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. నిజానికి జవాన్ తో పోలిస్తే అంతకుముందు ఎన్నో చిత్రాల్లో ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అతడు రక్తి కట్టించాడు. అయినా వేటికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ రాలేదు. షారూఖ్ ఈ పురస్కార గౌరవం కోసం 33 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు జవాన్ లాంటి కమర్షియల్ చిత్రంలో అతడి నటనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్నాడు.
ఆ నలుగురికి ఛాన్స్ లేదా?
ఇదిలా ఉంటే తెలుగు సినిమా లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కేది ఎప్పటికి? టాలీవుడ్ మూల స్థంబాల్లో సీనియర్లుగా ఉన్న చిరంజీవి సహా నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి వారికి జాతీయ ఉత్తమ నటుడు అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పటికి ఇంకా డైలమా అలానే కొనసాగుతోంది. ప్రస్తుతం వీరంతా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.
చిరంజీవి చీవాట్లతో జ్ఞానోదయం:
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లాంటి సోషియో ఫాంటసీ చిత్రంతో అభిమానులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు. ఆయన 'విశ్వంభర'తో నిరూపిస్తారా? ఈ చిత్రంలో జాతీయ అవార్డుల జూరీని మెప్పించే ప్రదర్శనను చిరు ఇస్తారా? అంటూ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ పెర్ఫామెన్సెస్ ఇచ్చిన బాస్ చిరంజీవికి జాతీయ అవార్డ్ దక్కకపోవడం ఆశ్చర్యకరం. 80లు 90లు లేదా ఆ తర్వాత కూడా మెగా బాస్ కి కేంద్రంలో రాజకీయాలు కలిసి రాలేదు. అదే క్రమంలో ఓ ఈవెంట్ కోసం దిల్లీకి వెళ్లిన చిరంజీవి అక్కడ గ్యాలరీలో తెలుగు సినిమాకి లేదా సౌత్ సినిమాకి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం చూసి షాక్ కి గురయ్యానని అన్నారు. దిల్లీలో ప్రాంతీయ భాషా చిత్రాలపై చిన్న చూపు గురించి ఆ సమయంలో చిరంజీవి బహిరంగంగా ఆరోపించారు. ఆయన ఆరోపణల తర్వాతే నరేంద్ర మోదీ లేదా ఎన్డీయే ప్రభుత్వానికి జ్ఞానోదయం అయింది.
అల్లు ది బెస్ట్ అనిపించాడు:
అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఇవ్వడానికి కారణం, పుష్పరాజ్ పాత్రలో అతడి అసాధారణ నట ప్రతిభ మాత్రమే కాదు... కేంద్రంలోని పెద్దలకు చిరు చీవాట్లతో అంతో ఇంతో జ్ఞానోదయం అవ్వడం కూడా ఒక కారణం. ప్రాంతీయ సినిమాల్ని కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం మొదలైంది కూడా ఇప్పుడే. తొలిగా అల్లు అర్జున్ లాంటి ప్రతిభావంతుడిని జాక్ పాట్ వరించింది. అతడి హార్డ్ వర్క్, కృషి ఫలించి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. దశాబ్ధాల తరవాత టాలీవుడ్ కి దక్కిన ఏకైక గొప్ప పురస్కారంగా దీనిని పరిగణించింది పరిశ్రమ. ఈసారి షారూఖ్ కి వచ్చింది.. వచ్చే ఏడాది చిరంజీవికి లేదా ఇతర ప్రతిభావంతులైన తెలుగు స్టార్లకు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పురస్కారాల్ని దక్కించుకునేంత గొప్ప ప్రదర్శనలు, అసాధారణ కంటెంట్ ని తెలుగు దర్శకులు అందించగలరని నిరూపించుకునే సమయం ఇది.
