Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సీన్ కే కాదు.. చాలా సినిమాలకు ఇలాగే సీన్ సితారే!

`తెల్ల కాగితం` సినిమా నుంచి హీరో, హీరోయిన్‌‌లకు సంబంధించిన ఒక ఘాటైన సన్నివేశం లీక్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

By:  Sivaji Kontham   |   3 Oct 2026 6:15 PM IST
ఆ ఒక్క సీన్ కే కాదు.. చాలా సినిమాలకు ఇలాగే సీన్ సితారే!
X

`తెల్ల కాగితం` సినిమా నుంచి హీరో, హీరోయిన్‌‌లకు సంబంధించిన ఒక ఘాటైన సన్నివేశం లీక్ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పటివరకు పెద్దగా లేని బజ్‌ని ఈ లీక్డ్ సీన్ తెచ్చిపెట్టింది. దీంతో ఇది కావాలనే చిత్రబృందం లీక్ చేసిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై దర్శకుడు తాజాగా సక్సెస్ వేదికపై స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ ఆ సన్నివేశం హద్దుమీరి ఉంటే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని, తాను ఈ సినిమాను పూర్తిగా క్లీన్‌గా ఫ్యామిలీ ఆడియెన్ కోసం తెరకెక్కించానని తెలిపారు. కేవలం ఆ ఒక్క సీన్ కారణంగా జనం థియేటర్లకు రాకపోతే ఎలా అని తాను తీవ్రంగా కంగారు పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిబట్టి దర్శకుడికి అలాంటి సీన్ లీక్ చేయాలనే ఎలాంటి ఇంటెన్సిటీ లేదని స్పష్టమైంది.

అయితే సినిమా చరిత్రను తిరగరాసి చూస్తే.. ఇలాంటి ఒక్క సీన్ లీక్ కారణంగానే యూత్ అంతా థియేటర్లకు క్యూ కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు సన్నివేశాలు లేదా సగం సినిమా లీకైనప్పటికీ ప్రేక్షకులు ఆ చిత్రాలను బాగా ఆదరించిన దాఖలాలున్నాయి. అదే విధంగా ఈ లీక్ `తెల్ల కాగితం` చిత్రానికి కూడా ఒక రకంగా ప్లస్ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో విడుదలైన చిత్రాలలో `అనకాపల్లి` చిత్రానికి కూడా పర్వాలేద‌నిపించే సమీక్షలే వచ్చాయి.

సినిమా పరిశ్రమలో ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రాల నుండి ముఖ్యమైన సన్నివేశాలు లేదా వీడియో క్లిప్‌‌లు ఆన్‌లైన్‌లో లీకవడం దర్శకులను, నిర్మాతలను తీవ్ర కలవరపెడుతుంటుంది. కొన్నిసార్లు సినిమా విడుదలైన కొద్దిసేపటికే లేదా విడుదలకు ముందే కీలకమైన లీక్‌లు బయటికి రావడం వల్ల చిత్ర బృందం తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మరియు.. అంచనాలున్న ప్రాజెక్ట్‌లు ఇలాంటి పైరసీ .. లీక్‌ల బారిన పడి తీవ్ర నష్టాలను, మానసిక ఆందోళనలను ఎదుర్కొన్నాయి.

ఇలాంటి ఘటనల వల్ల దర్శకులు తమ ఏళ్ల తరబడి శ్రమ ఒక్క క్షణంలో నీళ్లపాలవుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా సినిమాలోని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ లేదా కీలకమైన ట్విస్ట్‌లు ముందుగానే వైరల్ కావడం వల్ల థియేటర్లలో చూడాల్సిన అనుభూతి దెబ్బతింటుంది. ఈ సమస్యను అరికట్టడానికి నిర్మాతలు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. లీక్‌ల బెడద మాత్రం పూర్తిగా తగ్గడం లేదు. లీకైన కంటెంట్ కారణంగా ఎంతోమంది దర్శకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో కోకొల్లలు.