Begin typing your search above and press return to search.

తెలంగాణలో మ‌ళ్లీ ప‌ర్సంటేజ్ విధానం!

గ‌త కొన్నేళ్ల క్రితం తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల వ్య‌వ‌స్థ ప‌ర్పంటేజ్ విధానంలో సాగింది. ప్ర‌తి సినిమా మేకింగ్‌లో, స్టోరీస్‌ల‌లో వీరి పాత్ర ప్ర‌ధానంగా ఉండేది.

By:  Ravindar Gorantla   |   2 April 2026 5:12 PM IST
తెలంగాణలో మ‌ళ్లీ ప‌ర్సంటేజ్ విధానం!
X

గ‌త కొన్నేళ్ల క్రితం తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల వ్య‌వ‌స్థ ప‌ర్పంటేజ్ విధానంలో సాగింది. ప్ర‌తి సినిమా మేకింగ్‌లో, స్టోరీస్‌ల‌లో వీరి పాత్ర ప్ర‌ధానంగా ఉండేది. కాలం మారింది ప‌ర్సంటేజ్ విధానం పోయింది. దాని స్థానంలో రెంట‌ల్ సిస్టంని తీసుకొచ్చారు. అక్క‌డి నుంచి థియేట‌ర్లు దివాలా తీసి మూత‌ప‌డ‌టం మొద‌లైంది. గ‌త కొంత కాలంగా ఈ ప‌ద్ద‌తిలో సినిమాల‌ని ర‌న్ చేయ‌లేక‌, థియేట‌ర్ల‌ని న‌డిపించ‌లేక చాలా వ‌ర‌కు ఎగ్జిబిట‌ర్లు సినిమా హాళ్ల‌ని ఫంక్ష‌న్ హాల్స్‌గా మార్చేశారు. దీంతో థియేట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌ ఎగ్జిబిట‌ర్ల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ల్టీప్లెక్స్ త‌ర‌హాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాల‌ని ప్ర‌ద‌ర్శించాల‌ని హైద‌రాబాద్‌లోని 23 సింగిల్ స్క్రిన్ థియేట‌ర్ల యాజ‌మాన్యాలు నిర్ణ‌యించాయి.ఏప్రిల్ 3 నుంచి ఈ ప‌ర్సంటేజీ విధానం అమ‌ల్లోకి రానుంది. ఎగ్జిబిట‌ర్ల‌కు రెవెన్నూ షేరింగ్ విధానం 60, 50, 40 ప‌ర్పంటేజ్ ప‌ద్ద‌తుల్లో అంద‌నుంది. సినిమా ప్ర‌ద‌ర్శిత‌మైన మొద‌టి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడ‌వ వారం 40 శాతంగా ఉండ‌నుందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

23 మంది ఎగ్జిబిట‌ర్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌ను ఇటీవ‌ల సంప్ర‌దించి తెలంగాణ‌లోని ప‌లువురు అగ్ర‌శేణి డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలిపారు. వారి థియేట‌ర్లు ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో ఉన్న ప్రీమియం థియేట‌ర్ల‌ని, వాటిలో ప్రేక్ష‌కుల‌కు అన్ని సౌక‌ర్యాలున్నాయ‌ని, అయితే ఈ థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు చాలా ఖ‌ర్చ‌వుతోంద‌న్నారు. ప్ర‌స్తుత అద్దె విధానంతో మ‌నుగ‌డ సాగించ‌లేక‌పోతున్నామ‌ని తెలిపారు.

ప‌ర్సంటేజీ ప్రాతిపాదిక‌న సినిమాల‌ని ప్ర‌ద‌ర్శిస్తామ‌న్న త‌మ ప్ర‌పోజ‌ల్‌ను డిస్టిబ్యూట‌ర్లు అంగీక‌రించార‌ని తెలిపారు. శ‌శిధ‌ర్ రెడ్డి మాత్ర‌మే నిర్మాత‌లు, ఇత‌ర భాగ‌స్వాముల‌తో మ‌రింత‌ చ‌ర్చించి ఆ త‌రువాత అభిప్రాయం చెబుతామ‌న్నార‌ని పేర్కొన్నారు. ఇక‌పై తెలంగాణ‌లోని అన్ని సింగిల్ స్క్రీన్‌ల‌లో సినిమాల‌ను కేవ‌లం ప‌ర్సంటేజీ విధానంలోనే ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, ఇది విడ‌త‌ల వారీగా జ‌రుగుతుంద‌ని ఎగ్జిబిట‌ర్లు తెలిపారు` అని ఫిల్మ్ ఛాంబ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

మార్చి 11న బెంగ‌ళూరులో జ‌రిగిన ద‌క్షిణ భార‌త ఎగ్జిబిటర్ల స‌మావేశంలోనూ దీనిపై ఏక‌గ్రీవ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌న తెలుగు రాష్ట్రాలు మిన‌హా దేశంలోని అన్ని రాష్ట్రాల సింగిల్ స్క్రీన్‌లు ప‌ర్సంటేజీ విధానాన్నే అనుస‌రిస్తున్నాయి. సింగిల్ స్క్రిన్‌ల మ‌నుగ‌డ కోస‌మే తాజా నిర్ణ‌యం తీసుకున్నాం` అని డిస్ట్రిబ్యూట‌ర్లు, సినీ నిర్మాత‌ల‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ తెలిపింది. రెంట‌ల్ విధానానికి బ‌దులుగా ప‌ర్సంటేజీ విధానంలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న కోసం చాలా కాలంగా ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే ప‌ద్ద‌తిని తెలంగాణ అంత‌టా పాటిస్తే ఇంత వ‌ర‌కు రెంట‌ల్ విధానంలో సినిమా థియేట‌ర్ల‌ని లీజుకు తీసుకున్న వారికి పెద్ద షాకే న‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.