Begin typing your search above and press return to search.

టికెట్ రేట్లపై ఒక్క సంతకం కూడా పెట్టేలేద‌ట!

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడుతూ ప్ర‌త్యేక షోలు, పెద్ద సినిమాల టికెట్ రేట్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Entertainment Desk   |   10 Jan 2026 7:20 PM IST
టికెట్ రేట్లపై ఒక్క సంతకం కూడా పెట్టేలేద‌ట!
X

పెద్ద సినిమాలు, భారీ బ‌డ్జెట్ సినిమాల టికెట్ రేట్ల చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. పెద్ద సినిమాల‌కు టికెట్ రేట్లు ఎందుకు పెంచాల‌ని ఓ వ‌ర్గం వాదిస్తుంటే భారీ బ‌డ్జెట్‌ని రాబ‌ట్టుకోవాలంటే టికెట్‌రేట్లు పెంచాల్సిందేన‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. సంక్రాంతి బ‌రిలో భారీ సినిమాలు నిలిచిన నేప‌థ్యంలో ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు అంశంపై ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సినిమా ఇండ‌స్ట్రీకి షాక్ ఇస్తున్నాయి.

తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి శనివారం మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడుతూ ప్ర‌త్యేక షోలు, పెద్ద సినిమాల టికెట్ రేట్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రంలో గ‌తంలోనూ, ప్ర‌స్తుతం సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల టికెట్ రేట్ల విష‌యంపై అడిగితే తాను ఇండ‌స్ట్రీని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాన‌న్నారు.

`పుష్ప 2` త‌రువాత ఇండ‌స్ట్రీ గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాను. `పుష్ప 2` త‌రువాత బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచ‌మ‌ని నా వ‌ద్ద‌కు రాఒద్ద‌ని చెబుతూనే ఉన్నా. ఆ మ‌ధ్య విచ్చిన రెండు సినిమాలు, తాజాగా వ‌చ్చిన సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాల‌కు సంబంధించి ఏ ఫైలూ నా వ‌ద్ద‌కు రాలేదు. అప్లికేష‌న్ పెట్టుకోవ‌ద్ద‌ని నేనే చెబుతున్నా. న‌న్ను ఎవ‌రూ క‌ల‌వ‌డం లేదు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ చ‌నిపోయింది. ఎందుకు ప‌ర్మీష‌న్ ఇచ్చానా? అనిపించింది.

సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అసుప‌త్రి వాళ్లు, డీఎం హెచ్‌వో త‌దిత‌రుల‌తో మాట్లాడి ప్ర‌తీక్ ఫౌండేష‌న్ త‌రుపున రూ.25 ల‌క్ష‌ల చెక్ ఇచ్చాను. అప్ప‌టికి నిర్మాత కూడా ఎవ‌రినీ పంప‌లేదు. ప్ర‌భుత్వం నుంచి డ‌బ్బులు విడుద‌ల కావాలంటే ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం జ‌రుగుతుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన అబ్బాయిని పెంచి, చ‌దివిస్తాన‌ని ఆ తండ్రికి హామీ కూడా ఇచ్చాను. తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌లు పెంచ‌బోమ‌ని ఆ మ‌రుస‌టి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాట‌కు క‌ట్టుబ‌డి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సంత‌కం కూడా పెట్ట‌లేదు` అన్నారు.

న‌ల్ల‌గొండ‌కు సంబంధించిన అభివృద్ధి ప‌నులు చూసుకుంటూ వాటిని స‌మీక్షించుకుంటూ రాత్రే వ‌చ్చాను. నేను సినిమా ప‌రిశ్ర‌మ‌పై దృష్టి పెట్ట‌ద‌లుచుకోలేదు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కార్మికులు వ‌స్తే పేద క‌ళాకారుల విష‌యంలో మాత్ర‌మే జోక్యం చేసుకున్నా.. అంతే త‌ప్ప టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల‌కు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవ‌డం లేదు. టికెట్ ధ‌ర‌ల పెంపు గురించి వ‌స్తున్న జీవోల‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు` అంటూ తేల్చి చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.