Begin typing your search above and press return to search.

థియేటర్లలో పార్కింగ్ ఫీజు.. ఇకనైనా ఫాలో అవుతారా?

సినిమా చూసేందుకు టికెట్ తీసుకున్నప్పటికీ వాహనాలను పార్క్ చేయడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రేక్షకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.

By:  M Prashanth   |   7 March 2026 10:43 AM IST
థియేటర్లలో పార్కింగ్ ఫీజు.. ఇకనైనా ఫాలో అవుతారా?
X

సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు పార్కింగ్ ఫీజు అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా మారింది. సినిమా చూసేందుకు టికెట్ తీసుకున్నప్పటికీ వాహనాలను పార్క్ చేయడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రేక్షకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఆ అంశంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అప్పట్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని పలు జీవోలు చక్కర్లు కొట్టినప్పటికీ.. ఎవరూ ఫాలో అవ్వలేదని చెప్పాలి. అయితే ఆ వ్యవహారంపై తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది! సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

అంతే కాదు 2021లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 121ను హైకోర్టు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. టికెట్ ఉన్న ప్రేక్షకుల నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇకపై ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మల్టీప్లెక్స్‌ లు, షాపింగ్ మాల్స్‌ లో సినిమా టికెట్ లేదా కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే పార్కింగ్ ఉచితమే.

అయితే 2021లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆ నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఆ మినహాయింపులతోనే అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ వచ్చాయి. మల్టీప్లెక్స్ లో మాత్రం వసూలు చేయడం లేదు. ఇటీవల హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్‌ లోని ఓ థియేటర్‌ లో ఒక సంఘటన చోటుచేసుకుంది.

అక్కడ సినిమా చూడటానికి వెళ్లిన ఒక ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ కోసం రూ.20 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రేమ్ రమావత్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇచ్చిన మినహాయింపు సరైంది కాదని, ప్రేక్షకులపై అదనపు భారం పడుతోందని ఆయన తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

ఆ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం సింగిల్ థియేటర్స్ కు ఇచ్చిన మినహాయింపును ప్రశ్నించింది. ఇకపై మల్టీప్లెక్స్‌ లలో అమల్లో ఉన్న నిబంధనలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అమలు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై సినిమా టికెట్ ఉన్న ప్రతి ప్రేక్షకుడికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడం థియేటర్ల బాధ్యత! ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇకపై అయినా అన్ని థియేటర్లు కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.