Begin typing your search above and press return to search.

తెలంగాణలో రేట్ల పెంపు.. వేసవి చిత్రాల సంగతేంటి?

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి విషయంలో హైకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు టాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారాయి.

By:  M Prashanth   |   21 Jan 2026 3:50 PM IST
తెలంగాణలో రేట్ల పెంపు.. వేసవి చిత్రాల సంగతేంటి?
X

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి విషయంలో హైకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు టాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారాయి. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ హైక్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆ నిబంధన కచ్చితంగా అమలు చేస్తే రాబోయే చాలా సినిమాల విడుదల ప్రణాళికలు పూర్తిగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటి వరకు తెలంగాణలో సినిమాల విడుదలకు ముందు చివరి దశలో కూడా అనుమతులు తీసుకునే అవకాశం ఉండేది. కానీ తాజా ఆదేశాలతో ఆ సడలింపు ఇక ఉండదని తెలుస్తోంది. విడుదల తేదీ ఖరారు చేసిన వెంటనే మూడు నెలల ముందే ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో చాలా సినిమాల విడుదల తేదీలు ఒక నెల ముందు మాత్రమే ఖరారవుతుంటాయి.

షూటింగ్ ఆలస్యం కావడం, వీఎఫ్‌ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, ఇతర పెద్ద సినిమాలతో క్లాష్ నివారించడానికి తేదీలు మార్పు చేయడం వంటి కారణాలతో చివరి నిమిషంలో షెడ్యూల్ మారుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 90 రోజుల ముందే అనుమతులు కోరడం కష్టమని నిర్మాతలు చెబుతున్నారు. అయితే వేసవి సీజన్‌ లో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలపై ఆ నిబంధన ప్రభావం ఎక్కువగా పడనుంది.

చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్, నాగ చైతన్య వృష కర్మ, అడవి శేష్ డెకాయిట్, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటి గట్టు, నిఖిల్ స్వయంభూ, అఖిల్ లెనిన్, శర్వానంద్ బైకర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు వంటి చిత్రాలు వేసవిలో రావొచ్చని ప్రచారం ఉంది. అయితే వీటి విడుదల తేదీలు ఇప్పటికీ ఖరారు కాలేదు.

ఇప్పుడు ఆ సినిమాలన్నీ కొత్త నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లేకపోతే టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి లభించకపోవచ్చు. దీంతో విడుదల తేదీలు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు కీలక అంశంగా మారింది. మొదటి వారం కలెక్షన్ల మీదే లాభనష్టాలు ఆధార పడుతుండటంతో అనుమతులు రాకపోతే నిర్మాతలకు ఆర్థిక భారం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం ఇలాంటి నిబంధనలు లేవు. అక్కడ ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో మాత్రమే ఈ విధానం అమలైతే నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కొత్త నిబంధనపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.