Begin typing your search above and press return to search.

తెలంగాణ ఛాంబ‌ర్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్?

తెలుగు సినీ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావించడానికి పవన్ కళ్యాణ్ తమకు కేవలం 15 నిమిషాల పాటు సమావేశమవడానికి అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

By:  Sivaji Kontham   |   28 May 2026 10:43 AM IST
తెలంగాణ ఛాంబ‌ర్‌కి ప‌వ‌న్ క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఎగ్జిబిటర్లకు మధ్య రెవెన్యూ మోడల్‌కు సంబంధించిన వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. థియేటర్లలో రెంట్ విధానానికి బదులుగా పర్సంటేజీ సిస్టమ్ (రెవెన్యూ షేరింగ్) అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, నిర్మాతల వైపు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో నెలకొన్న తాజా పరిస్థితులు సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ ఛాంబర్ అధికారికంగా లేఖ రాయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినీ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావించడానికి పవన్ కళ్యాణ్ తమకు కేవలం 15 నిమిషాల పాటు సమావేశమవడానికి అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ లభిస్తే ఈ ప్రతినిధుల బృందంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జె. చంద్రశేఖర్ రావు, ప్రముఖ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాల రాజ్ వంటి కీలక సినీ ప్రముఖులు పాల్గొంటారని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఈ స‌మ‌స్య‌ల పరిష్కారం కోసం పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమై తమ సమస్యలను వివరించగా మరోవైపు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతలు వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి తదితరులు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసి ఇండస్ట్రీ సవాళ్లపై చర్చించారు. రెండు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల నిర్వహణ, విడుద‌ల‌కు వ‌స్తున్న‌ పెద్ద సినిమాల విడుదలలకు సంబంధించిన రెవెన్యూ మోడల్స్ వంటి అంశాలపై పవన్ కళ్యాణ్‌తో నిర్మాతల బృందం సుదీర్ఘంగా మాట్లాడింది.

ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా, అటు నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్ల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో.. ప్రభుత్వ అగ్రనేతను సంప్రదించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ భావిస్తోంది. ముఖ్యంగా పెద్ద చిత్రాల థియేట్రికల్ రన్.. సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకు ఈ ఉమ్మడి చర్చలు దోహదపడతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.

రెండు రాష్ట్రాల్లో థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూ.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ‌యాలు వచ్చేలా చేయడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.