సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించాలంటే!
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలుగు స్టార్ హీరోలకు, నిర్మాతలకు ఒక కీలక విన్నపాన్ని అందించింది.
By: Sivaji Kontham | 12 May 2026 11:24 PM ISTతెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలుగు స్టార్ హీరోలకు, నిర్మాతలకు ఒక కీలక విన్నపాన్ని అందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాత కాలపు అద్దె పద్ధతికి స్వస్తి పలికి.. `పర్సంటేజ్ షేరింగ్` (శాతాల ప్రాతిపదికన పంపకం) విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రిలీజ్ చేసిన నోట్ లో పలు అంశాలను పేర్కొన్నారు. పర్సంటేజ్ షేరింగ్ విధానం థియేటర్ల మనుగడకు అత్యవసరమని అసోసియేషన్ నొక్కి చెప్పింది.
ప్రస్తుతం పరిశ్రమలో నిర్మాతలు ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు ఈ పర్సంటేజ్ షేరింగ్ విధానాన్నే అనుసరిస్తున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే మిగిలిన 10 వారాల్లో మాత్రం సింగిల్ స్క్రీన్లపై పాత పద్ధతిని విధిస్తున్నారు. ఈ విధానం వల్ల థియేటర్ యాజమాన్యాలకు నష్టం కలుగుతోంది కాబట్టి ఆ 10 వారాల్లో కూడా అదే పర్సంటేజ్ విధానాన్ని వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
నేటి కాలంలో థియేటర్లలో సినిమాల ప్రదర్శన సమయం భారీగా తగ్గింది. గతంలో సినిమాలు వారాల తరబడి ఆడేవి.. కానీ ఇప్పుడు భారీ చిత్రాలు కూడా కొద్ది రోజుల్లోనే గరిష్ట వసూళ్లను సాధిస్తున్నాయి. ఉదాహరణకు `ఎఫ్2` వంటి చిత్రాలు 8 వారాలు ఆడితే.. ఇటీవల వచ్చిన `ధురంధర్` వంటి సినిమాలు కేవలం రెండు మూడు వారాలకే పరిమితమవుతున్నాయి. ప్రేక్షకులు తక్కువ సమయంలోనే ఎక్కువ థియేటర్లలో సినిమా చూస్తుండటం వల్ల అద్దె మోడల్ థియేటర్లకు భారంగా మారింది.
మల్టీప్లెక్స్ థియేటర్లు ఇప్పటికే ఈ పర్సంటేజ్ షేరింగ్ లాభాలను పొందుతుండగా.. సమానమైన వసూళ్లు రాబట్టే సింగిల్ స్క్రీన్లను మాత్రం పక్కన పెట్టడం వివక్షతో కూడుకున్నదని అసోసియేషన్ వాదిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో `పుష్ప` వంటి భారీ చిత్రాలకు సింగిల్ స్క్రీన్లకు షేరింగ్ ఇచ్చారని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అన్యాయమైన వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు.
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో పాత అద్దె పద్ధతిని కొనసాగించడం అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు ఇబ్బందికరంగా మారింది. ఈ నూతన పర్సంటేజ్ మోడల్ అనేది పరిశ్రమలో రిస్క్ తో పాటు లాభాలను సమానంగా పంచుకునే ఒక `విన్-విన్` పద్ధతి అని అసోసియేషన్ అభిప్రాయపడింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల వారసత్వాన్ని కాపాడుకోవడానికి .. పరిశ్రమను స్థిరంగా ఉంచడానికి అందరూ కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
