Begin typing your search above and press return to search.

తెలంగాణలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

ముఖ్యంగా తెలంగాణలో పెద్ది సినిమాకు టికెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   23 May 2026 6:58 PM IST
తెలంగాణలో పెద్ది టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే టాలీవుడ్‌ లో కొత్త చర్చకు దారితీసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. ముఖ్యంగా తెలంగాణలో పెద్ది సినిమాకు టికెట్ ధరలు పెంచబోమని స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో తెలంగాణకు చెందిన కొంతమంది ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. కేవలం ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చని తెలిపారు. తెలంగాణలో మాత్రం పెంపు ఉండదని చెప్పారు. ప్రేక్షకులపై అదనపు భారం వేయడం సరైంది కాదని, ఇప్పటికే ఆ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రేక్షకులను చంపొద్దని, అధిక ధరలతో థియేటర్లకు దూరం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

గత కొంతకాలంగా భారీ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచడం సాధారణంగా మారింది. అయితే ఆ నిర్ణయాల వల్ల మధ్యతరగతి ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారనే అభిప్రాయం ఎగ్జిబిటర్లలో పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌ కు రావడంలో వెనకడుగు వేస్తున్నారని వారు చెబుతున్నారు. అందుకే తెలంగాణలో సాధారణ ధరలకే సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే పెద్ది సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. పెద్ది లాంటి పెద్ద సినిమాలకు తాము సెల్యూట్ చేస్తామని, ఆ సినిమాతో తమకు ఎలాంటి వ్యక్తిగత సమస్య లేదని చెప్పారు. ఇది పూర్తిగా పరిశ్రమలో అమలవుతున్న విధానాలకు సంబంధించిన అంశం మాత్రమేనని వారు తెలిపారు. దీంతో వివాదం సినిమా కంటే కూడా టికెట్ ధరల విధానం చుట్టూ తిరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక మరో కీలక అంశంగా పర్సంటేజ్ విధానం కూడా చర్చకు వచ్చింది. తెలంగాణలో సినిమా ప్రదర్శన జరగాలంటే పర్సంటేజ్ విధానంపై స్పష్టత అవసరమని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొంది. పెద్ది సినిమాకు కూడా పర్సంటేజ్ విధానం అమలు కావాలని, ఎంత శాతం ఇవ్వాలన్నది ముందే నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు వ్యూహాలు అమలులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పెద్ది విడుదలకు ముందే టికెట్ రేట్ల వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. ప్రేక్షకుల ప్రయోజనాలు, నిర్మాతల వ్యాపార లెక్కలు, ఎగ్జిబిటర్ల ఆందోళనలు.. ఆ మూడు అంశాల మధ్య రాజీ ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇక సినిమా విడుదల సమయానికి ఆ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.