ఫుల్ ఫాంతో షేక్ చేస్తోన్న తెలంగాణ డైరెక్టర్లు!
ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్లు అంటే? ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా హైలైట్ అయ్యేవారు. సినిమా పై ఆసక్తి ఆంధ్రా వాళ్లకు ఉన్నంత తెలంగాణలో కనిపించేది కాదు.
By: Srikanth Kontham | 3 Aug 2026 5:00 AM ISTఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్లు అంటే? ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా హైలైట్ అయ్యేవారు. సినిమా పై ఆసక్తి ఆంధ్రా వాళ్లకు ఉన్నంత తెలంగాణలో కనిపించేది కాదు. ఈ నేపథ్యంలో నటీనటులతో పాటు డైరెక్టర్లు కూడా తక్కువగానే ఉండేవారు. కానీ ఇప్పుడు అదే తెలంగాణ డైరెక్టర్లు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఏకంగా గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే రేంజ్ డైరెక్టర్లు పుట్టుకొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది రగ్డ్ అండ్ ఇంటెన్స్ సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగా గురించి.
తనదైన బోల్డ్ అండ్ రా అప్రోచ్‌తో బాక్సాఫీస్ లెక్కలను మార్చేసిన సందీప్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన సినిమాల్లోని ఎమోషన్స్, హీరోల ఎలివేషన్స్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపుతున్నాయి. అలాగే తొలి సినిమాతోనే టెర్రిఫిక్ ఇంపాక్ట్ చూపించి ఇప్పుడు నేచురల్ అండ్ మాస్ ఎలివేషన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల పేరు కూడా ప్రముఖంగా నిలుస్తోంది. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను అద్భుతంగా ఆవిష్కరించడంలో.. కమర్షియల్ హంగులతో కూడిన కథలను తెరకెక్కించడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ గా శ్రీకాంత్ దూసుకుపోతున్నారు. మరోవైపు టాలీవుడ్ స్థాయిని విశ్వ వేదికపై నిలబెట్టిన దర్శకుడిగా నాగ్ అశ్విన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సైన్స్ ఫిక్షన్ ,మైథలాజికల్ జోనర్లను అద్భుతంగా మిక్స్ చేసి గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఆయన తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ మేధస్సు, ఆలోచనా విధానం తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప విషయంగా నిలుస్తోంది.
ఇక క్లాసిక్ లవ్ స్టోరీలు, పీరియాడిక్ డ్రామాలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. విజువల్స్ పరంగా, భావోద్వేగాల పరంగా హను అందించే సినిమాల్లో ఒక కవితాత్మకత కనిపిస్తుంది. తనదైన మార్కు టైమింగ్, సింపుల్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతున్న అనుదీప్ కూడా ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
మరోవైపు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ విజయాలను తన ఖాతాలో వేసుకుం టున్నారు వంశీ పైడిపల్లి. సెన్సిటివ్ పాయింట్స్ కథను నడిపించడంలో వంశీ మాస్టర్. అందులో వంశీని కొట్టే వారే లేరు. `ఊపిరి` ,`మహర్షి` లాంటి క్లాసిక్ హిట్స్ వంశీ ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. అలాగే తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, మనుషుల మధ్య బంధాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి కూడా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇలా ఒకరేంటి? తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ దర్శకులందరూ ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్నారు. భవిష్యత్ లో మరింత మంది తెలంగాణ దర్శకులు, నటీనటులు తెరపైకి రావడం ఖాయం.
