Begin typing your search above and press return to search.

తెలంగాణ యాస ఉంటే చాలదు.. బాక్సాఫీస్ లెక్కలు వేరే గురూ!

తెలంగాణ పల్లెలు, అక్కడి మనుషుల జీవన శైలిని వెండితెరపై చూపిస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగానే ఉంది.

By:  M Prashanth   |   29 Oct 2026 12:12 PM IST
తెలంగాణ యాస ఉంటే చాలదు.. బాక్సాఫీస్ లెక్కలు వేరే గురూ!
X

తెలంగాణ పల్లెలు, అక్కడి మనుషుల జీవన శైలిని వెండితెరపై చూపిస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగానే ఉంది. అయితే కేవలం యాస, నేటివిటీని నమ్ముకున్నంత మాత్రాన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. శర్వానంద్ 'భోగి', ప్రియదర్శి 'ఇడుపు కాయితం' విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంతో వచ్చిన చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే ఇండస్ట్రీకి ఎన్నో ఆసక్తికరమైన పాఠాలు కనిపిస్తాయి.

2023లో వచ్చిన 'బలగం' తెలంగాణ పల్లె సంస్కృతిని, బంధాలను అందంగా చూపి చిన్న బడ్జెట్‌తోనే భారీ లాభాలు కొల్లగొట్టింది. అదే ఊపులో సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో నాని చేసిన 'దసరా' వంద కోట్ల క్లబ్‌లో చేరి మాస్ స్టామినా చాటింది. లోకల్ కుర్రాళ్ల పంచ్‌లతో వచ్చిన 'మేమ్ ఫేమస్' సైతం సేఫ్ జోన్‌లోకి వెళ్లగా.. రానా సమర్పించిన 'పరేషాన్' మాత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచింది. అంటే ఒకే ఏడాది ఒకే నేటివిటీతో నాలుగు విభిన్న ఫలితాలు కనిపించాయి.

ఇక 2024లో పటేల్ వ్యవస్థ, చదువు పోరాటంతో వచ్చిన 'పొట్టేల్' కంటెంట్ పరంగా ఆకట్టుకున్నా టికెట్లు తెంచలేకపోయింది. రజాకార్ల చరిత్రను వెండితెరపైకి తెచ్చిన 'రజాకార్' కూడా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా మిగిలింది. కానీ హైదరాబాద్ లోకల్ స్లాంగ్‌ను రొమాంటిక్ కామెడీకి వాడుకున్న 'టిల్లు స్క్వేర్' వంద కోట్ల మార్క్ దాటి రికార్డులు సృష్టించింది. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితమే కనిపించింది.

ఇల్లందు యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' తక్కువ బడ్జెట్‌లో వచ్చి సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. మరోవైపు కుల వివక్షను ఎత్తిచూపిన 'దండోరా' విమర్శకుల ప్రశంసలు పొందినా థియేటర్లలో బోల్తా పడి, ఓటీటీలో మాత్రమే ఆదరణ దక్కించుకుంది. భారీ కాన్వాస్‌తో తెరకెక్కిన 'ఛాంపియన్' కూడా తెలంగాణ చరిత్రను చెప్పే ప్రయత్నంలో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

ఇటీవల నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'ది ప్యారడైజ్' పరిస్థితి చూస్తే ఈ లెక్క మరింత స్పష్టమవుతుంది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కి ఓపెనింగ్స్ రాబట్టినా, 'దసరా' రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. దీన్నిబట్టి తెలంగాణ యాస ఒక్కటే హిట్ గ్యారెంటీ కార్డు కాదని, కథలో సరైన ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ అయితేనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అర్థమవుతుంది.

ఇక ఈ ఏడాది రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు నటించిన 'మారెమ్మ' కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కింది. గ్రామదేవత మారెమ్మ, ఊరి ఆచారాలు, నమ్మకాల చుట్టూ నడిచే కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. తెలంగాణ నేటివిటీని బలంగా చూపించినప్పటికీ కమర్షియల్‌గా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

ఇప్పుడు శర్వానంద్ నవంబర్ 12న వస్తున్న 'భోగి'తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో గంగ పాత్రతో సంపత్ నంది ఫుల్ మాస్ యాక్షన్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 11న ప్రియదర్శి, నాగదుర్గల కాంబోలో బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్న 'ఇడుపు కాయితం' ఒక సరికొత్త ఫ్యామిలీ డ్రామాతో రాబోతోంది. ఒకటి భారీ పీరియడ్ యాక్షన్, మరొకటి పచ్చి పల్లెటూరి కథ.. ఈ రెండు చిత్రాలు తెలంగాణ సినిమాల జాబితాలో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తాయో చూడాలి.