Begin typing your search above and press return to search.

నిర్మాతలు ఈ నష్టాన్ని గుర్తిస్తున్నారా?

టాలీవుడ్లో పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా టికెట్ల ధరలు పెంచుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

By:  Garuda Media   |   10 Jan 2026 6:00 AM IST
నిర్మాతలు ఈ నష్టాన్ని గుర్తిస్తున్నారా?
X

టాలీవుడ్లో పెద్ద సినిమాలు రిలీజైనపుడల్లా టికెట్ల ధరలు పెంచుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ఏ ఇబ్బందీ లేకుండా అనుమతులు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో ప్రతిసారీ తలనొప్పి తప్పట్లేదు. ఏ పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామో నిర్మాతల వైపు నుంచి ఎన్ని వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. ప్రేక్షకులైతే ఈ విషయంలో సానుకూలంగా లేరన్నది స్పష్టం.

రేట్ల పెంపు అంశంలో ప్రేక్షకుల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్న మాట వాస్తవం. ఐతే భారీ బడ్జెట్ పెట్టి, ప్రేక్షకుల వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తున్నపుడు రేట్లు పెంచకపోతే ఎలా వర్కవుట్ అవుతుంది అన్నది నిర్మాతల వాదన. ‘రాజాసాబ్’ భారీ బడ్జెట్ సినిమాకు రేట్ల పెంచడాన్ని తప్పుబట్టలేం కూడా. ఐతే ఇలా రేట్లు పెంచి నిర్మాతలు నిజంగా ప్రయోజనం పొందుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.

అదనపు షోలు వేయాలని, టికెట్ల ధరలు పెంచుకోవాలని అనుకున్నపుడు సరైన ప్లానింగ్ ఉండడం చాలా కీలకం. కనీసం పది రోజుల ముందు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని విడుదలకు ఐదారు రోజుల ముందు జీవో వచ్చేలా చూసుకుంటే మంచిది. కానీ నిర్మాతల వైపు ఆలస్యం జరుగుతోందా.. లేకా ప్రభుత్వాల వైపు నుంచి నాన్చుతున్నారా అన్నది తెలియడం లేదు కానీ.. జీవోలు రావడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. దాని తాలూకు ప్రతికూల ప్రభావం బుకింగ్స్ మీద గట్టిగా పడుతోంది.

ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి అయితే దారుణంగా తయారవుతోంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’కు ఏపీలో త్వరగానే జీవో వచ్చేసింది. కానీ తెలంగాణలో విడుదలకు ముందు రోజు వరకు జాప్యం జరిగింది. చాలా లేటుగా బుకింగ్స్ మొదలయ్యాయి. బెనిఫిట్ షోలకు ఏకంగా రూ.వెయ్యి రేటు పెట్టడం వల్ల ఆదాయం పెరిగి ఉండొచ్చు కానీ.. లేట్ బుకింగ్స్ వల్ల జరిగిన నష్టం తక్కువేమీ కాదు. ‘అఖండ-2’ విషయంలోనూ హడావుడి తప్పలేదు.

తాజాగా ‘రాజాసాబ్’కు జరిగింది చూశాక ఎందుకొచ్చిన బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఏపీలో జీవో తెప్పించుకోవడంలో ఇబ్బంది లేకపోయినా.. ఇంకాస్త ముందు రావాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో అయితే తీవ్రమైన జాప్యం జరిగింది. ముందుగా కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకునే ప్రయత్నంలో కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి జీవో వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. దీంతో వందల థియేటర్లలో పెయిడ్ ప్రిమియర్స్ కోసం చేసుకున్న ఏర్పాట్లు వృథా అయ్యాయి. థియేటర్ల దగ్గర అభిమానులు పడ్డ యాతన అంతా ఇంతా కాదు.

దీని బదులు అదనపు రేట్లు లేకుండా నార్మల్‌గా ప్రిమియర్స్ వేసి ఉన్నా నాలుగైదు కోట్లకు తక్కువ కాకుండా షేర్ వచ్చేదేమో. తొలి రోజు రెగ్యులర్ షోలకు కూడా తెల్లవారుజామునే బుకింగ్స్ మొదలయ్యాయి. అప్పటికే టాక్ బయటికి రావడంతో బుకింగ్స్ మీద ప్రతికూల ప్రభావం పడడం ఖాయం. అసలే సినిమాకు డివైడ్ టాక్ ఉన్నపుడు, ఎక్స్‌ట్రా రేటుతో టికెట్లు కొనడానికి ప్రేక్షకులు తటాపటాయిస్తారనడంలో సందేహం లేదు. ఇక షోలు ఎంతకీ కన్ఫమ్ కాకపోవడం.. రోజుల తరబడి ఎదురు చూడడం.. ఎక్కువ రేటు పెట్టి సినిమా చూడడం లాంటి కారణాలతో ప్రేక్షకుల్లో కలిగే అసహనం గురించి కూడా ఆలోచించాలి. దీని బదులు ఈ రేట్ల గోల వదిలేసి.. సాధారణ ధరలతోనే నాలుగైదు రోజుల ముందు బుకింగ్స్ మొదలుపెట్టి ఉంటే వీకెండ్ మొత్తానికి ముందే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యుండేవి. అదనపు రేట్లతో వచ్చే లాభం కంటే ఇలా ముందే బుకింగ్స్ ఓపెన్ చేసి ఎక్కువ టికెట్లు అమ్ముకుని ఉంటే వచ్చే ప్రయోజనమే ఎక్కువ ఉండేదేమో. చివరికి చూస్తే రేట్ల పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం సినీ కార్మికులకో, ఛారిటో కోసమో ఉపయోగించాలనే షరతు ఉంది. ఇది పోగా చివరికి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అదనపు ఆదాయం ఎంత? అదనపు రేట్లతో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటే.. కనీసం ఐదారు రోజుల ముందే అనుమతులు తెచ్చుకోవాలి, కోర్టు కేసుల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. లేదంటే మాత్రం ఈ రేట్ల సంగతి పక్కన పెట్టి మామూలుగా సినిమాను రిలీజ్ చేసుకోవడం మంచిదేమో.