బాలయ్య కూతురి అరంగేట్రం నిజమేనా?
హీరోల కుటుంబాల నుంచి హీరోలు వస్తారు తప్ప.. హీరోయిన్లు రావడం అరుదు. అలా వచ్చిన సందర్భాల్లో కూడా అభిమానుల నుంచి అంత సానుకూల స్పందన ఉండదు.
By: Garuda Media | 31 July 2026 7:27 PM ISTహీరోల కుటుంబాల నుంచి హీరోలు వస్తారు తప్ప.. హీరోయిన్లు రావడం అరుదు. అలా వచ్చిన సందర్భాల్లో కూడా అభిమానుల నుంచి అంత సానుకూల స్పందన ఉండదు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మంజుల హీరోయిన్ అవ్వాలనుకుంటే ఫ్యాన్స్ ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. ఐతే ఆమె కొంచెం లేటుగా నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఆపై మంచు లక్ష్మీప్రసన్న, నిహారిక కొణిదెల, శివాని, శివాత్మిక లాంటి వాళ్లు స్టార్ కుటుంబాల నుంచి హీరోయిన్లు అయ్యారు. కానీ వారిలో ఎవ్వరూ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఐతే ఇప్పుడు టాలీవుడ్లో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి నటనలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.
బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి వ్యాపార రంగంలో బిజీ కాగా.. చిన్న కూతురు కూడా బిజినెస్ ఉమన్‌గానే కొనసాగుతోంది. పెళ్లయి ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యాక తేజస్విని ఇప్పుడు నటన వైపు అడుగులేయబోతోందనే వార్త చర్చనీయాంశంగా మారింది. ఐతే ఆమెకు నటనలోకి వచ్చే ఉద్దేశం ఉందని ఈ మధ్య స్పష్టంగా తెలుస్తోంది. ఒక యాడ్‌లో నటించడమే కాక.. రెండు డ్యాన్స్ వీడియోలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. మరోవైపు తన తండ్రి నటిస్తున్న కొత్త సినిమాకు ఆమె నిర్మాణ భాగస్వామిగానూ ఉంది. ఈ క్రమంలోనే తేజస్విని నటనలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్ ఏమీ చేయదని.. ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో ఆమె లీడ్ రోల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
సినిమా ఫైనల్ అయినట్లు కాంక్రీట్ న్యూస్ లేదు కానీ.. కథా చర్చలు జరుగుతున్న సంగతైతే నిజమే అంటున్నారు. బాలయ్య కూతురు నటనలోకి అడుగు పెడుతుందంటే అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ న్యూస్ లీక్ చేశారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు అభిమానుల ఆలోచన కూడా మారుతుండడం.. తేజస్విని ఒకవేళ నటించినా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోలే చేసే అవకాశం ఉండడంతో ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చే అవకాశముంది.
