Begin typing your search above and press return to search.

కరణ్ ప్లేస్‌లో తేజ సజ్జా.. ప్రైమ్ చూసింది ఏంటి?

సెలబ్రిటీలతో మాట్లాడటం, వాళ్ల మధ్య ఉండే ఈగోస్‌ను హ్యాండిల్ చేయడం, సరదాగా పంచ్ వేస్తూనే సీరియస్ మూడ్‌లోకి వెళ్లడం కరణ్‌కు కొత్త కాదు.

By:  M Prashanth   |   29 Sept 2026 12:46 PM IST
కరణ్ ప్లేస్‌లో తేజ సజ్జా.. ప్రైమ్ చూసింది ఏంటి?
X

ఓటీటీలో గేమ్ షోలు కొత్త కాకపోవచ్చు కానీ, ఒక అంతర్జాతీయ మైండ్ గేమ్ ఫార్మాట్‌ను రీజినల్ మార్కెట్‌కు తీసుకురావడం అంత ఈజీ కాదు. అమెజాన్ ప్రైమ్ వీడియో హిందీలో ‘ది ట్రేటర్స్’ చేసినప్పుడు కరణ్ జోహార్‌ను హోస్ట్‌గా తీసుకుంది. సెలబ్రిటీలతో మాట్లాడటం, వాళ్ల మధ్య ఉండే ఈగోస్‌ను హ్యాండిల్ చేయడం, సరదాగా పంచ్ వేస్తూనే సీరియస్ మూడ్‌లోకి వెళ్లడం కరణ్‌కు కొత్త కాదు. కానీ తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి ప్రైమ్ తేజ సజ్జాను రంగంలోకి దించింది.

‘ది ట్రేటర్స్’ బిగ్‌బాస్ తరహాలో గొడవలు, టాస్కుల మీద నడిచే షో కాదు. 20 మంది సెలబ్రిటీలు ఒక ప్యాలెస్‌లో ఉంటారు. వాళ్లలో కొందరు ట్రేటర్స్‌గా ఉంటే, మిగతా వాళ్లు వారిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అన్న అనుమానమే గేమ్‌ను ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ హోస్ట్ పని కేవలం రూల్స్ చెప్పడం కాదు. సరైన సమయంలో టెన్షన్ పెంచడం, కంటెస్టెంట్లను మాట్లాడించడం, రౌండ్ టేబుల్ దగ్గర ఆ మూడ్‌ను క్యారీ చేయడం కూడా చాలా ముఖ్యం.

ప్రోమో వరకు చూస్తే తేజను కూడా అదే టోన్‌లో ప్రెజెంట్ చేశారు. రాయల్ ప్యాలెస్ సెట్టింగ్, క్యాండిల్ లైట్ బ్యాక్‌డ్రాప్, వెల్వెట్ కాస్ట్యూమ్స్‌తో రెగ్యులర్ రియాలిటీ షో హోస్ట్‌లా కాకుండా ఒక గేమ్ మాస్టర్ ఫీలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ‘నమ్మకం అనేది ఒక మోసం’ అంటూ తేజ చెప్పిన డైలాగ్ కూడా కాన్సెప్ట్‌కు సెట్ అయింది. కానీ ప్రోమోలో రెండు లైన్లు చెప్పడం ఒకటి.. ఆ 20 మంది మధ్య గేమ్ వేడెక్కినప్పుడు అదే కమాండ్ చూపించడం మరోటి.

ఇక్కడ ప్రైమ్ తీసుకున్న నిర్ణయం కూడా ఇంట్రెస్టింగ్. హిందీలో అనుభవం ఉన్న కరణ్‌ను పెట్టి, తెలుగులో మాత్రం అలాంటి హోస్టింగ్ ట్రాక్ రికార్డ్ లేని తేజను ఎంచుకుంది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత తేజ పేరు మాస్ ఆడియన్స్ దాకా వెళ్లింది. అదే సమయంలో అతను చాలా లౌడ్‌గా కాకుండా కూల్‌గా మాట్లాడే స్టైల్ ఈ ఫార్మాట్‌కు సెట్ అవుతుందనే నమ్మకం కూడా ప్రైమ్‌కు ఉండి ఉండొచ్చు.

కెరీర్ పరంగా కూడా తేజకు ఇది కొత్త స్పేస్. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే ఓటీటీ షో హోస్ట్ చేయడం వల్ల ఆయనను మరో కోణంలో చూసే అవకాశం వస్తుంది. అక్టోబర్ 15 నుంచి షో స్ట్రీమింగ్ కానుంది. 20 మంది సెలబ్రిటీల పూర్తి లిస్ట్ బయటకు వచ్చిన తర్వాతే గేమ్ మీద అసలు హైప్ మొదలవుతుంది. కరణ్ జోహార్‌తో హిందీలో నడిచిన ఫార్మాట్‌ను తెలుగులో తేజ తన స్టైల్‌లో ఎంతవరకు నిలబెట్టగలడో చూడాలి.