Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో అగ్ర‌ సినీకుటుంబ నేపథ్యం లేకపోయినా..!

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తేజ సజ్జా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

By:  Sivaji Kontham   |   13 Sept 2026 12:56 PM IST
టాలీవుడ్‌లో అగ్ర‌ సినీకుటుంబ నేపథ్యం లేకపోయినా..!
X

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తేజ సజ్జా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన సైమా (SIIMA) అవార్డ్స్-2026 వేడుకలో `మిరాయ్` సినిమాకు గాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా రెండేళ్లపాటు ఈ వేదికపై ఈ గౌరవం దక్కడంపై యువ‌న‌టుడు త‌న‌ ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ విజయం తన డైరెక్టర్, టెక్నీషియన్లు .. తనను నమ్ముతూ వస్తున్న అభిమానులందరికీ చెందుతుందని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.





ఈ వేడుకలో తేజ సజ్జాతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వివిధ విభాగాలలో అవార్డులను కైవసం చేసుకున్నారు. బెస్ట్ హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేశ్ (సంక్రాంతికి వస్తున్నాం), సపోర్టింగ్ యాక్టర్‌గా సత్యదేవ్ (కింగ్డమ్), మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ (OG), అలాగే సినిమాటోగ్రఫీ విభాగంలో కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్) అవార్డులు అందుకున్నారు. ఈ విజేతల జాబితా టాలీవుడ్‌లో కొత్త ప్రతిభకు దక్కుతున్న గుర్తింపునకు అద్దం పడుతోంది.





టాలీవుడ్‌లో నటుడిగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న తేజ సజ్జాకు ప్రస్తుతం ప్రతిభతో పాటు అదృష్టం కూడా పూర్తి స్థాయిలో కలిసి వస్తున్నాయి. టాలీవుడ్‌లో అగ్ర‌ సినీకుటుంబ నేపథ్యం లేకపోయినా.. తనదైన కథల ఎంపికతో తనకంటూ ఒక బలమైన మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు.





ప్రస్తుతం తేజ సజ్జా చేతిలో అన్నీ భారీ పాన్ ఇండియా సీక్వెల్ ప్రాజెక్ట్‌లు ఉండటం విశేషం. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన `జంబి రెడ్డి`కి సీక్వెల్‌గా వస్తున్న`జంబి రెడ్డి 2`, దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్న `జై హనుమాన్`, అలాగే `మిరాయ్` చిత్రానికి కొనసాగింపుగా రానున్న`మిరాయ్ 2` వంటి సినిమాలతో తేజూ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ సీక్వెల్స్ కావడంతో ప్రేక్షకులు- ట్రేడ్ వర్గాలలో ముందే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.





ఇలా వరుసగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడంతో పాటు... పాన్ ఇండియా స్థాయిలో భారీ సీక్వెల్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టడం తేజ సజ్జా కెరీర్‌ను ఓ కొత్త దశకు తీసుకెళ్తోంది. భ‌విష్య‌త్‌లో ఈ సినిమాలతో అత‌డు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారనే దానిపై అభిమానులలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.