తేజ సజ్జా నెక్ట్స్ ఏంటంటే..?
వాస్తవానికి జాంబిరెడ్డి2 ను మొదట్లో నాగ వంశీ నిర్మిస్తారన్నారు కానీ ఇప్పుడా ప్రాజెక్టును మిరాయ్ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 5:53 PM ISTచైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన తేజ సజ్జా ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాలో ఎక్కువగా మాట్లాడుకునే వారిలో ఇప్పుడు తేజ కూడా ఒకరు. 2024 సంక్రాంతికి తేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హను మాన్ సినిమా రిలీజై కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మిరాయ్ సక్సెస్‌తో ఆశ్చర్యపరిచిన తేజ
హను మాన్ సక్సెస్ చూసి ఆశ్చర్యపోయిన కొందరు ఏదో ఆ సినిమా హిట్టైందిలే మళ్లీ హిట్ కొట్టగలరా అనుకున్నారు. కానీ మిరాయ్ సినిమాతో అలా అనుకున్న అందరి నోళ్లను మూయించారు తేజ. మిరాయ్ సినిమా కేవలం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ తో అందరినీ మెప్పించింది. దీంతో మిరాయ్ తర్వాత తేజ ఏ సినిమా చేయనున్నారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నెక్ట్స్ మూవీగా జాంబిరెడ్డి
కాగా ప్రస్తుతం మిరాయ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తేజ సజ్జా తన తర్వాతి సినిమాగా జాంబిరెడ్డి2 ను చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ సినిమా 2021 ఫిబ్రవరిలో రిలీజైంది. చిన్న సినిమాగా వచ్చిన జాంబి రెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటూ ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ ను అందుకుంది.
మరోసారి పీపుల్ మీడియా బ్యానర్ లో..
అలాంటి జాంబి రెడ్డి సినిమాకు సీక్వెల్ ను తేజ తన తర్వాతి సినిమాగా చేయబోతున్నారు. వాస్తవానికి జాంబిరెడ్డి2 ను మొదట్లో నాగ వంశీ నిర్మిస్తారన్నారు కానీ ఇప్పుడా ప్రాజెక్టును మిరాయ్ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ను అందించనుండగా, డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ రానా నాయుడు, ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ పేరైతే వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. కాగా తేజ నటించి మూడు సినిమాలు జాంబిరెడ్డి, హను మాన్, మిరాయ్ మంచి సక్సెస్ అందుకోవడంతో పాటూ ఆ మూడు సినిమాలకు సీక్వెల్స్ రానుండటం విశేషం.
