తేజ సజ్జ.. ఈసారి లెక్క ఇంకా పెద్దదే!
‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జ సినిమాల మీద అంచనాలు పూర్తిగా మారిపోయాయి.
By: M Prashanth | 22 Aug 2026 8:36 PM IST‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జ సినిమాల మీద అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చిన్న బడ్జెట్‌లో కొత్త కథలు ప్రయత్నించే హీరోగా కనిపించిన తేజ.. ఇప్పుడు తన ప్రతి సినిమాను పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేస్తున్న కొత్త సినిమా మాత్రం ఆయన కెరీర్‌లో మొదటి హిట్‌ను మళ్లీ గుర్తు చేస్తోంది. అదే ‘జాంబీ రెడ్డి’.
ఈ సినిమా నుంచి ఆగస్టు 23న ఉదయం 10:08 గంటలకు కొత్త అప్డేట్ ను ఇవ్వనున్నారు. దానికి ముందు వదిలిన పోస్టర్‌లో తేజ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. రక్తంతో ఉన్న చేతిని మాత్రం హైలైట్ చేశారు. పైగా రేపు విధ్వంసం మొదలవుతుందనే అర్థం వచ్చేలా పోస్టర్‌పై లైన్ పెట్టారు. చూస్తుంటే మరోసారి జాంబీస్ చుట్టూ కథ ఉండబోతోందనే ఆసక్తి కలుగుతోంది.
తేజకు ‘జాంబీ రెడ్డి’ చాలా కీలకమైన సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2021లో వచ్చిన ఆ సినిమాతోనే సోలో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. రాయలసీమలోని ఒక గ్రామం, అక్కడికి జాంబీస్ రావడం.. మధ్యలో కామెడీతో ఆ కథను నడిపించారు. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర కూడా వర్కవుట్ అయింది. అందుకే దీనికి రెండో భాగం ఉంటుందనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది.
ఇప్పుడు తేజ చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ వచ్చినప్పుడే మరో ఆసక్తికరమైన లైన్ పెట్టారు. ‘రాయలసీమ నుంచి ప్రపంచం అంతం వరకు’ అనే అర్థం వచ్చేలా దాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త పోస్టర్‌లో ఏకంగా ప్రపంచ విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కలిపి చూస్తే ‘జాంబీ రెడ్డి’లో ఒక ప్రాంతానికి పరిమితమైన కథను ఈసారి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారా అనే ఆసక్తి వస్తోంది.
పైగా ‘జాంబీ రెడ్డి 2’ కథ సిద్ధంగా ఉందనే వార్తలు గతంలోనే వచ్చాయి. ప్రశాంత్ వర్మ కథ అందిస్తారని, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు కూడా అప్పటినుంచే ఈ ప్రాజెక్టుతో వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం తేజ చేస్తున్న సినిమా అదేనా.. లేక జాంబీస్ నేపథ్యంలో పూర్తిగా మరో కథను సిద్ధం చేశారా అన్నది రేపటి ప్రకటనతో తేలే అవకాశం ఉంది.
