స్టార్‌డమ్ కొలతలు, ప్రామాణికత లెక్కలు మారాయ్.. ఈ తెలుగు హీరోనే ప్రూఫ్!
జపాన్ దేశం తెలుగు సినిమాలకు ఒక బలమైన ఓవర్సీస్ మార్కెట్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'మిరాయ్' చిత్రం విడుదల కాకుండానే జపాన్ గడ్డపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
By: Sivaji Kontham | 20 Aug 2026 3:05 PM ISTజపాన్ దేశం తెలుగు సినిమాలకు ఒక బలమైన ఓవర్సీస్ మార్కెట్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన 'మిరాయ్' చిత్రం విడుదల కాకుండానే జపాన్ గడ్డపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. డే-1 ముందస్తు అడ్వాన్స్ బుకింగ్స్‌లో జపాన్‌లో అత్యధిక బుకింగ్స్ సాధించిన `టాప్ 10` భారతీయ చిత్రాల జాబితాలోకి `మిరాయ్` చేరింది. ఇప్పటివరకు ఆర్.ఆర్.ఆర్, బాహుబలి 2, పుష్ప 2, దేవర, సలార్ వంటి భారీ చిత్రాలు మాత్రమే సాధించిన ఈ అరుదైన ఘనతను ఇప్పుడు ఒక యంగ్ హీరో అందుకోవడం విశేషం. అంతేకాకుండా `ధురందర్ 2`ను వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' రికార్డులకు చేరువగా వెళ్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
జపనీస్ ప్రేక్షకులను భారతీయ స్టార్ హీరోలలో ప్రధానంగా ఆకర్షించే అంశం లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్.. అమితమైన ఆత్మవిశ్వాసం- భావోద్వేగాలు. ప్రతీకూల పరిస్థితులను దాటుకుని పోరాడే కథానాయకుడి తత్వాన్ని వారు బాగా ఇష్టపడతారు. దీనికితోడు జపనీస్ సంస్కృతికి, భారతీయ సంస్కృతికి మధ్య లోతైన ఆధ్యాత్మిక - సాంస్కృతిక బంధం ఉంది. ప్రకృతిని, దైవత్వాన్ని, పురాణాలను గౌరవించే సాంప్రదాయం రెండు దేశాల్లోనూ సమానంగా కనిపిస్తుంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల్లోని ధర్మం కోసం పోరాడే నైతికత అక్కడి ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కాబట్టే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను వారు తమ సొంత నటులుగా ఆదరించారు.
ఇప్పుడు తేజ సజ్జా నటించిన `మిరాయ్` కన్సెప్ట్ కూడా జపనీస్ సంస్కృతికి, వారి పురాణేతిహాసాలకు చాలా దగ్గరగా ఉండే అంశాలపై చర్చ సాగుతోంది. జపనీస్ అనిమే - మాంగా సంస్కృతిలో ఫాంటసీ ప్రపంచం, ప్రాచీన రహస్యాలు, విజువల్స్, కర్మ సిద్ధాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. `మిరాయ్` కథాంశం భారతీయ ఇతిహాసాలు, అశోకుడి 9 రహస్య గ్రంథాల నేపథ్యంతో కూడుకున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా కావడం వల్ల ఇది జపనీస్ పురాణ కథల్లోని `మిస్టరీ అండ్ సూపర్ నేచురల్` కాన్సెప్టులకు అత్యంత ఆప్ట్‌గా సరిపోతుంది.
ఇప్పటివరకు ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి మాస్ అండ్ కట్-ఔట్ హీరోలను చూసిన జపనీస్ ప్రజలు, తేజ సజ్జా లాంటి నవతరం హీరోని కూడా అదే కోణంలో ఆదరిస్తారా అనే ప్రశ్నకు `మిరాయ్` అడ్వాన్స్ బుకింగ్స్ సరైన సమాధానం ఇస్తున్నాయి. జపాన్ ప్రేక్షకులకు కేవలం ఒక నటుడి భౌతిక రూపం- లుక్కు మాత్రమే ముఖ్యం కాదు, ఆ పాత్రలోని వీరత్వం, కథలోని బలం ముఖ్యం. `హనుమాన్` సినిమాతో ఇప్పటికే జపాన్‌లో అడుగుపెట్టి రూ. 1 కోటి వసూలు చేసిన తేజ సజ్జా, తన పాత్రలోని అమాయకత్వం, దైవిక శక్తి లభించినప్పుడు చూపించే శౌర్యంతో అక్కడి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు `మిరాయ్` ద్వారా సరికొత్త హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నాడు.
ఓవర్సీస్ మార్కెట్‌లో తేజ సజ్జా ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. హనుమాన్ ఇచ్చిన బలమైన పునాదితో ఇప్పుడు `మిరాయ్` సాధిస్తున్న ట్రెండ్ చూస్తుంటే తెలుగు సినిమా జపాన్ విజయాల చరిత్రలో మరొక సంచలనాత్మక అధ్యాయం లిఖించబడటం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ పురాణాలు, లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్స్, జపనీస్ మైండ్ సెట్‌కు సరిపోయే ఫాంటసీ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరితే తేజ సజ్జా కూడా జపాన్‌లో తిరుగులేని ప్రజాదరణ పొందే నవతరం గ్లోబల్ స్టార్‌గా నిలవడం ఖాయం. కెరీర్ ఆరంభమే తేజ సజ్జా లాంటి హీరో సల్మాన్ ఖాన్ రికార్డుకు చేరువగా వెళుతున్నాడు! అని చర్చించుకోవడం తెలుగు వారిలో ఎంత క్రేజీగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇదీ సినీజగత్తులో మహత్తు అంటే!
