Begin typing your search above and press return to search.

'దురంధర్' తర్వాత 'మిరాయ్'.. అకాడెమీ అవార్డుల్లో మెరుపు!

ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల రేసులో `మిరాయ్` చిత్రం అద్భుతమైన మెరుపులు మెరిపిస్తోంది.

By:  Sivaji Kontham   |   18 March 2026 8:30 PM IST
దురంధర్ తర్వాత మిరాయ్.. అకాడెమీ అవార్డుల్లో మెరుపు!
X

ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల రేసులో `మిరాయ్` చిత్రం అద్భుతమైన మెరుపులు మెరిపిస్తోంది. భారతీయ సినిమా రంగంలోని వివిధ పరిశ్రమలను ఏకతాటిపైకి తెస్తూ ఏర్పాటు చేసిన `ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ` (ఐఎన్‌సీఏ) తన తొలి అవార్డుల నామినేషన్లను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ య‌వ‌తేజం తేజ స‌జ్జా న‌టించిన `మిరాయ్` ఏకంగా 10 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకోవడం విశేషం. ధురంధర్, లోకా, కాంతారా, ఛావా వంటి అత్యంత భారీ బడ్జెట్ .. పాన్ ఇండియా చిత్రాలతో పోటీపడుతూ ఈ పరిమిత బడ్జెట్ సినిమా నిలబడటం ఇండ‌స్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తేజ సజ్జా వంటి యువ హీరో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఒక రైజింగ్ స్టార్ సినిమాకు 17 నామినేషన్లు సాధించిన ధురంధర్ వంటి భారీ చిత్రాల సరసన చోటు దక్కడం నిజంగా ఆ చిత్ర బృందానికి దక్కిన గొప్ప గౌరవం. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తన ప్రతిభతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. పరిమిత వనరులతోనే అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌ను జోడించి ఒక విభిన్నమైన కథాంశాన్ని ప్రేక్షకులకు అందించడంలో ఆయన విజయం సాధించారు.

ఐఎన్సీఏ అవార్డులు ప్ర‌క‌టించ‌డం ఇదే మొదటిసారి. ఇవి భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనున్నాయి. పన్నెండు భాషలు పన్నెండు సినిమా ఇండస్ట్రీలకు చెందిన నటులు, టెక్నీషియన్లు నిర్మాతలను ఒకే వేదిక కిందకు తీసుకురావడమే ఈ అకాడమీ ప్రధాన లక్ష్యం. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మద్దతుతో నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోంది. 2025లో విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమలోని అనుభవజ్ఞులతో కూడిన జ్యూరీ ప్యానెల్ ఈ నామినేషన్లను ఎంపిక చేసింది.

మొత్తం 25 కేటగిరీలలో ప్రకటించిన ఈ నామినేషన్లలో మిరాయ్ .. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటన వంటి ప్రధాన విభాగాలతో పాటు సాంకేతిక విభాగాల్లోనూ పోటీ పడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ ఇండస్ట్రీ బాడీస్ ఈ అవార్డుల విజేతలను నిర్ణయిస్తాయి. అంటే ఈ అవార్డు రావడం అనేది కేవలం ఒక జ్యూరీ నిర్ణయం మాత్రమే కాదు మొత్తం సినీ పరిశ్రమ ఇచ్చే గుర్తింపుగా భావించవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా కథలో దమ్ముంటే ఇండస్ట్రీ మొత్తం అండగా నిలుస్తుందని మిరాయ్ నిరూపించింది.

ఈ ప్రతిష్ఠాత్మక ఐఎన్సీఏ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఏప్రిల్ 16న ముంబైలో వైభవంగా జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు నటులు టెక్నీషియన్లు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. భారతీయ సినిమా రంగానికి ఒక గ్లోబల్ స్థాయి గుర్తింపునిచ్చే ఈ వేదికపై `మిరాయ్` ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధురంధర్ తర్వాత అవార్డుల రేసులో చర్చల్లో నిలిచిన చిత్రంగా `మిరాయ్` ఇప్పటికే ఒక ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మిరాయ్ చిత్రంలో మంచు మ‌నోజ్, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు న‌టించిన సంగ‌తి తెలిసిందే.