పాన్ ఇండియా ట్రెండ్‌లో తేజ సజ్జ కొత్త స్ట్రాటజీ!
టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jun 2026 10:00 PM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. అయితే అలాంటి సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు రెండేళ్లు, మూడేళ్ల వరకు సమయం తీసుకోవడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, విస్తృత స్థాయి ప్రీ ప్రొడక్షన్, దేశవ్యాప్త రిలీజ్‌ల కారణంగా స్టార్ హీరోల సినిమాల మధ్య గ్యాప్ కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ హీరో తేజ సజ్జ మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు.
హనుమాన్ సక్సెస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ కెరీర్ ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఒకవైపు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మిరాయ్ 2, మరోవైపు ప్రేక్షకాదరణ పొందిన జాంబీరెడ్డి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జాంబీ రెడ్డి 2.. ఇలా ఒకేసారి రెండు సీక్వెల్స్‌పై ఆయన పని చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌లు సమాంతరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తేజ కూడా రెండు సెట్ల మధ్య తన షెడ్యూల్‌ను సమన్వయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు.
ఈ రెండు ప్రాజెక్టులకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. రెండింటినీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఒకే హీరోతో, ఒకే సమయంలో రెండు భారీ సినిమాలను నిర్మించే నిర్ణయం నిర్మాత కాన్ఫిడెన్స్‌కు నిదర్శనంగా కనిపిస్తోంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జ మార్కెట్ పెరగడం, యూత్ ఆడియన్స్ లో అతనికి ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక జాంబీ రెడ్డి2 ద్వారా బాలీవుడ్ నటి షనాయా కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు మిరాయ్2 కూడా భారీ స్థాయిలో రూపొందుతుండటంతో రెండు సినిమాలపైనా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తున్న సమయంలో, తేజ సజ్జ వచ్చే ఏడాదే రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకోవడం విశేషంగా మారింది. ఇది కేవలం హీరో కెరీర్‌కే కాకుండా నిర్మాతల రిలీజ్ ప్లానింగ్‌పైనా స్పష్టమైన నమ్మకాన్ని చూపిస్తోంది. రెండు వేర్వేరు జానర్లలో రూపొందుతున్న ఈ సీక్వెల్స్ ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తే, తేజ సజ్జను యంగ్ హీరోల రేసులో మరింత బలమైన స్థానంలో నిలబెట్టడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా ఒకే ఏడాదిలో డబుల్ సక్సెస్ అందించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
