Begin typing your search above and press return to search.

పెళ్లిలో అతిథుల‌కు వ‌జ్రాలు కానుకిచ్చిన ప్ర‌ముఖ గాయ‌ని

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల వివాహం న్యూయార్క్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది

By:  Sivaji Kontham   |   5 July 2026 7:46 AM IST
పెళ్లిలో అతిథుల‌కు వ‌జ్రాలు కానుకిచ్చిన ప్ర‌ముఖ గాయ‌ని
X

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల వివాహం న్యూయార్క్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటు సంగీత ప్రపంచం.. అటు క్రీడా రంగం కలగలిసిన ఈ అద్భుత వేడుకకు ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికైంది. ఈ ఏడాదిలోనే అత్యంత హాట్ టాపిక్‌గా మారిన ఈ భారీ వివాహ వేడుక‌లో నిన్న ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత కఠినమైన భద్రతా వలయాల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకలను వీక్షించడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ వివాహ వేడుకకు టేలర్ స్విఫ్ట్ జీవితంలోని వివిధ దశలకు చెందిన సన్నిహితులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. హాలీవుడ్ తారలు సెలెనా గోమెజ్, గిగీ హడిద్, బ్రాడ్లీ కూపర్, జో క్రావిట్జ్, హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, డకోటా జాన్సన్‌లతో పాటు పాప్ సింగర్ ఎడ్ షీరన్ వంటి దిగ్గజాలు విచ్చేశారు. టేలర్ చిన్ననాటి స్నేహితురాలు అబిగైల్ ఆండర్సన్ బెరార్, మోడల్ కార్లీ క్లోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే క్రీడా ప్రపంచం నుండి కైల్ జుస్జిక్, క్రిస్టిన్, రాస్ ట్రావిస్, స్పోర్ట్స్ కామెంటేటర్ ఎరిన్ ఆండ్రూస్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఈ వివాహ వేడుకకు హాజరైన తారలు తమ అద్భుతమైన ఫ్యాషన్ తో రెడ్ కార్పెట్ ఈవెంట్‌ని తలపించారు. ఈ అద్భుత వివాహ వేడుకలకు ముందు రోజు రాత్రి మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఎరీనా ఫ్లోర్‌లో గ్రాండ్ రిహార్సల్ డిన్నర్ జరిగింది. ఈ వేడుకలో టేలర్ స్విఫ్ట్.. ట్రావిస్ కెల్సీల కుటుంబ సభ్యులు..స్నేహితులతో కలిపి సుమారు 1000 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. అయితే అంతకుముందు ఈ నెల 2న మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల కోసం ప్రత్యేకంగా జరిగిన మరో రిహార్సల్ డిన్నర్ ఈవెంట్ కూడా అందరినీ ఆకర్షించింది. ఈ ప్రైవేట్ వేడుకల కోసం మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ చుట్టుపక్కల వీధులను మూసివేసి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో అతిథులకు నూతన వధూవరులు ఇచ్చిన విలాసవంతమైన బహుమతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ రిహార్సల్ డిన్నర్‌కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన షాంపైన్ ఫ్లూట్స్‌ను (గ్లాసులు) టేలర్-ట్రావిస్ జంట కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. వేడుక ముగిసి బయటకు వస్తున్న అతిథుల చేతుల్లో నల్లటి వెల్వెట్ బాక్సులు ప్రత్యేకంగా కనిపించాయి. ఆ బాక్సులపై టేలర్- ట్రావిస్ పేర్ల ప్రతీకగా `T&T` అనే అక్షరాలతో పాటు రెండు హృదయాల చిహ్నాలు ముద్రించి ఉండటం ఈ బహుమతుల ప్రత్యేకతను.. వారి ప్రేమను చాటిచెప్పింది.