ప్రపంచ చరిత్రలో మరో గాయని ఇలాంటి ఫేమ్ సంపాదించాలంటే?
ఈ అరుదైన గౌరవంతో పాటు స్విఫ్ట్ గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డుల వేటను కొనసాగిస్తున్నారు.
By: Sivaji Kontham | 12 Jun 2026 11:27 PM ISTఅంతర్జాతీయ పాప్ సంగీత ప్రపంచంలో టైమ్ లెస్ క్వీన్‌గా దూసుకుపోతున్న టేలర్ స్విఫ్ట్ (36) తన కీర్తికిరీటంలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకున్నారు. ప్రతిష్టాత్మక `సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ - SHOF` లో స్థానం సంపాదించుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన గాయనిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో స్విఫ్ట్ పాల్గొని సుమారు 21 నిమిషాల పాటు ఎంతో భావోద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన సంగీత ప్రయాణం కోసం తన కుటుంబం చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు.
టేలర్ స్విఫ్ట్ తన విజయానికి మూలస్తంభాలుగా నిలిచిన తన తల్లిదండ్రులు, సోదరుడికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. తాను కేవలం 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రపంచ సాంగ్ రైటింగ్ రాజధానిగా పిలుచుకునే `నాష్‌విల్లే`లో తన ప్రతిభకు పదును పెట్టుకోవడానికి వీలుగా.. తన కుటుంబం మొత్తం పెన్సిల్వేనియా నుండి అక్కడికి మకాం మార్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక సాధారణ కుటుంబం అంతా ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లడం నా తల్లిదండ్రులకు, సోదరుడికి ఎంతమాత్రం సులభం కాదు. పదాలతో ఆడుకోవడం నా వృత్తి అయినా.. నా కోసం వారు చేసిన ఆ త్యాగానికి నా కృతజ్ఞతలను ఏనాటికీ మాటల్లో వ్యక్తపరచలేను. ఈ రోజు నేను ఈ వేదికపై నిలబడటానికి మీరే కారణం! అంటూ స్విఫ్ట్ ఎమోషనల్ అయ్యారు.
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ వేడుకలో టేలర్ స్విఫ్ట్‌ను ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించారు. స్పీల్బర్గ్ ప్రసంగిస్తూ.. `టేలర్ పాటలు మన ఆత్మలపై చెరగని ముద్ర వేస్తాయి. మనందరి గురించి ఆమెకు చాలా బాగా తెలుసు`` అని కొనియాడారు. అనంతరం స్విఫ్ట్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో సాంగ్ రైటింగ్ మాత్రమే తనకు సహజసిద్ధంగా వచ్చిన ఏకైక కళ అని పేర్కొన్నారు. అది ఒక సహజమైన ప్రవృత్తి లాంటిదని.. తనకు ఎవరూ పాటలు రాయడం నేర్పించలేదని చెప్పారు. అయితే ఒక చోట రద్దీగా ఉండే జనాలను ఎలా అలరించాలి? కొరియోగ్రఫీ ఎలా నేర్చుకోవాలి? పరిశ్రమలో ఎలా నెగ్గుకురావాలి? భారీ గందరగోళం, వైఫల్యాల మధ్య తన మానసిక ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలనే విషయాలను మాత్రం ఎన్నో కఠినమైన పాఠాలు, ఒడిదుడుకుల ద్వారా నేర్చుకోవలసి వచ్చిందని టేలర్ స్విఫ్ట్ వివరించారు.
ఈ అరుదైన గౌరవంతో పాటు స్విఫ్ట్ గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో రికార్డుల వేటను కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన 12వ స్టూడియో ఆల్బమ్ `ది లైఫ్ ఆఫ్ ఎ షోగర్ల్` తో టేలర్ తన సొంత సేల్స్ రికార్డులను సైతం బద్దలు కొట్టారు. సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ చరిత్రలో 33 ఏళ్ల వయసులో ఈ గౌరవం దక్కించుకున్న లెజెండ్ స్టీవీ వండర్ తర్వాత, అత్యంత పిన్న వయస్కురాలిగా (36 ఏళ్లు) నిలిచింది టేలర్ స్విఫ్ట్ మాత్రమే కావడం విశేషం. ఈ వేదికపై తను రాసిన ఐకానిక్ ట్రాక్స్ అయిన ఆల్ టూ వెల్ (10 మినిట్ వెర్షన్), బ్లాంక్ స్పేస్, యాంటీ-హీరో, లవ్ స్టోరీ, ది లాస్ట్ గ్రేట్ అమెరికన్ డైనస్టీ వంటి ప్రజాదరణ పొందిన సాంగ్స్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఈ చారిత్రాత్మక వేడుకకు టేలర్ స్విఫ్ట్ తన కాబోయే భర్త, ఎన్ఎఫ్ఎల్ స్టార్ ట్రావిస్ తో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ వచ్చే నెలలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో జోరుగా షికార్ చేస్తున్నాయి.. ఈ ఏడాది స్విఫ్ట్‌తో పాటు అలిస్ మోరిస్సెట్, కెన్నీ లాగిన్స్, ప్రఖ్యాత రాక్ బ్యాండ్ `కిస్` స్టార్స్ జీన్ సిమన్స్, పాల్ స్టాన్లీ తదితరులు కూడా ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. 1969లో స్థాపించిన ఈ సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గత 50 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 మందికి లోపు సంగీతకారులకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం. 4 గ్రామీ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న ఏకైక రికార్డు ఉన్న టేలర్ స్విఫ్ట్ ఖాతాలో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం తన గ్లోబల్ లెగసీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
