Begin typing your search above and press return to search.

రికార్డ్: సైడ్ బిజినెస్‌లు లేకుండా గాయ‌ని సంప‌ద 18,990 కోట్లు

ప్రపంచ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఆర్థికంగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

By:  Sivaji Kontham   |   8 Jun 2026 8:30 AM IST
రికార్డ్: సైడ్ బిజినెస్‌లు లేకుండా గాయ‌ని సంప‌ద 18,990 కోట్లు
X

ప్రపంచ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఆర్థికంగా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ తాజా క‌థ‌నం ప్రకారం.. ఈ గాయ‌ని నికర ఆస్తి విలువ ఏకంగా 2 బిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.18,990 కోట్లు) చేరుకుంది. ఈ అసాధారణమైన మైలురాయితో చరిత్రలోనే అత్యంత సంపన్న మహిళా గాయ‌నిగా, సంగీత విద్వాంసురాలిగా స్విఫ్ట్ నిలిచారు. కేవలం తన 36వ ఏటనే ఈ స్థాయి ఆర్థిక విజయాన్ని అందుకోవడం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆస‌క్తిక‌రంగా ఎలాంటి సైడ్ బిజినెస్ లు లేకుండా కేవ‌లం గాయ‌నిగా ఇంత మొత్తం సంపాదించ‌డం మ‌రో రేర్ రికార్డ్.

సాధారణంగా చిత్ర పరిశ్రమలోనో .. సంగీత రంగంలోనో ఉండే సెలబ్రిటీలు బిలియనీర్లుగా మారడానికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సొంత‌ మేకప్ లైన్లు, దుస్తుల వ్యాపారాలు లేదా ఇతర సైడ్ బిజినెస్‌లు ప్రధాన కారణాలుగా ఉంటాయి. కానీ టేలర్ స్విఫ్ట్ ప్రయాణం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఈ గాయ‌ని ఎలాంటి ఇతర వ్యాపార సామ్రాజ్యాలపైనా ఆధారపడకుండా.. కేవలం తన పాటల రచన, రికార్డు స్థాయి అమ్మకాలు, లైవ్ కాన్సర్ట్ ప్రదర్శనల ద్వారా మాత్రమే ఈ పది అంకెల సంపదను, బిలియ‌నీర్ స్టాట‌స్‌ను సాధించిన ప్రపంచపు మొట్టమొదటి సంగీతకారిణిగా రికార్డు సృష్టించారు.

ఈ భారీ సంపదకు ప్రధాన కారణం త‌ను నిర్వహించిన చారిత్రాత్మక `ది ఎరాస్ టూర్` . ఐదు ఖండాలవ్యాప్తంగా 21 నెలల పాటు సాగిన ఈ సంగీత ప్రయాణం ఏకంగా 2.2 బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి... ప్రపంచ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన కాన్సర్ట్ టూర్‌గా నిలిచింది. ఈ టూర్‌లోని మొత్తం 149 స్టేడియం షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. కేవలం టికెట్ల అమ్మకాలే కాకుండా దీని ఆధారంగా వచ్చిన కాన్సర్ట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 261 మిలియన్ డాలర్లు వసూలు చేసి... అత్యధిక వసూళ్లు సాధించిన కాన్సర్ట్ మూవీగా రికార్డు కెక్కింది.

టేలర్ స్విఫ్ట్ సాధించిన ఈ ఆర్థిక విజయం వెనుక త‌న‌ సొంత ఆల్బమ్‌ల హక్కులపై ఆమెకున్న పట్టు మరొక ముఖ్యమైన కారణం. మిడ్‌నైట్స్, ది టోర్చర్డ్ పోయెట్స్ డిపార్ట్‌మెంట్ వంటి ఇటీవలి ఆల్బమ్‌లు బిల్‌బోర్డ్ చార్ట్స్‌లో నెలల తరబడి అగ్రస్థానంలో కొనసాగి సరికొత్త రికార్డులు సృష్టించాయి. తన సంగీతంపై పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో యుక్త‌ వయసు నుంచే డబ్బును పొదుపు చేస్తూ వచ్చినట్లు టేల‌ర్ స్విఫ్ట్ గతంలో పేర్కొన్నారు. నేడు ఈ గాయ‌నికి ఉన్న రియల్ ఎస్టేట్ విలువ కూడా సుమారు 110 మిలియన్ డాలర్లు (రూ.900 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా.

వ్యాపార పరంగా ఇంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా టేలర్ స్విఫ్ట్ సామాజిక బాధ్యతలోనూ ముందే ఉన్నారు. తన ఎరాస్ టూర్ కోసం రాత్రింబగళ్లు శ్రమించిన డ్యాన్సర్లు... సౌండ్ టెక్నీషియన్లు.. ట్రక్ డ్రైవర్ల వంటి సిబ్బందికి స‌ద‌రు గాయ‌ని సుమారు 197 మిలియన్ డాలర్లను బోనస్‌లుగా పంచిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే తుఫాను బాధితులకు.. విద్యా సంస్థలకు కోట్లాది రూపాయల విరాళాలు అందిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. కేవలం ప్రతిభను, కష్టాన్ని నమ్ముకుని ఒక మహిళ తన స్వీయ సృజనాత్మకతతో ప్రపంచాన్ని ఏలవచ్చని టేలర్ స్విఫ్ట్ నిరూపించారు.