తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
సంక్రాంతి సీజన్ లో థియేటర్ల వద్ద సినిమాల హడావుడి నడుస్తుంటే, అటు ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ సందడి చేస్తోంది.
By: M Prashanth | 17 Jan 2026 10:57 PM ISTసంక్రాంతి సీజన్ లో థియేటర్ల వద్ద సినిమాల హడావుడి నడుస్తుంటే, అటు ఓటీటీల్లో కూడా కొత్త కంటెంట్ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్మగ్లింగ్ నేపథ్యంతో నీరజ్ పాండే సృష్టించిన ఈ సిరీస్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ కుమార్ (అనురాగ్ సిన్హా), స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలని ఫిక్స్ అవుతాడు. దీనికోసం అప్పటికే సస్పెండ్ అయిన అర్జున్ మీనా (ఇమ్రాన్ హష్మీ) బృందాన్ని మళ్లీ రంగంలోకి దింపుతాడు. అంతర్జాతీయ స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న బడా చౌదరిని ఈ టీమ్ ఎలా పట్టుకుంది అనేదే ఈ సిరీస్ కథ.
సాధారణంగా సినిమాల్లో స్మగ్లింగ్ సీన్స్ కొన్ని నిమిషాలకే పరిమితం అవుతాయి, కానీ ఈ సిరీస్ మొత్తం దాని చుట్టూనే సాగుతుంది. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎలా పనిచేస్తుంది, ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించారు. అర్జున్ మీనా వాయిస్ ఓవర్ ద్వారా కథను వివరించిన తీరు ఆకట్టుకుంటుంది.
సిరీస్ ప్రారంభంలో పాత్రల పరిచయం, ఆఫీసర్ల ఎలివేషన్ బాగున్నప్పటికీ, అర్జున్ మీనా టీమ్ అసలు ఎందుకు సస్పెండ్ అయ్యారో చెప్పకపోవడం కొంచెం అసంతృప్తి కలిగిస్తుంది. అలాగే కొన్ని సైడ్ క్యారెక్టర్లను ఎక్కువగా చూపించడం వల్ల అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే ‘ఆపరేషన్ లాంగ్‌షాట్’ మొదలైన తర్వాత కథ మళ్లీ వేగం పుంజుకుని ఆసక్తిని కలిగిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే, ఇమ్రాన్ హష్మీ తన ‘సీరియల్ కిస్సర్’ ఇమేజ్ పక్కన పెట్టి, కస్టమ్స్ సూపరింటెండెంట్ అర్జున్ మీనా పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించారు.
అనురాగ్ సిన్హా కూడా అసిస్టెంట్ కమిషనర్‌గా తన నటనతో మెప్పించారు. టెక్నికల్ గా చూస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏడు ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఊహించని మలుపు సెకండ్ సీజన్ పై ఆసక్తిని పెంచుతుంది. కుటుంబంతో కలిసి చూసేందుకు ఎలాంటి ఇబ్బంది లేని ఈ క్రైమ్ థ్రిల్లర్, థ్రిల్ ఇచ్చే కంటెంట్ ఇష్టపడే వారికి ఒక మంచి ఆప్షన్ అనే టాక్ వస్తోంది.
