తరుణ్ భాస్కర్ వర్సెస్ జర్నలిస్ట్.. మళ్ళీ మొదలైన లొల్లి!
దీనికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ "సారీ సార్.. ఐ యామ్ యాక్సెప్టింగ్.. కాళ్ళు మొక్కమంటారా?" అని మళ్ళీ సెటైరికల్ గా అనడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
By: M Prashanth | 8 Dec 2025 11:45 PM ISTసెలబ్రిటీలు జర్నలిస్టుల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి చర్చలు వివాదస్పదంగా మారుతుంటాయి. కానీ లేటెస్ట్ గా దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఓ సీనియర్ జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'ఓం శాంతి శాంతి శాంతిః' టీజర్ లాంచ్ ఈవెంట్ లో జరిగిన ఈ సంఘటన నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
ఈవెంట్ లో భాగంగా సదరు జర్నలిస్ట్ ప్రశ్నించడానికి మైక్ తీసుకోగానే.. తరుణ్ భాస్కర్ మధ్యలో కల్పించుకుని "హ్యాపీ క్రిస్మస్ సార్.. అడ్వాన్స్ మెర్రీ క్రిస్మస్" అంటూ కామెంట్ చేశారు. దీంతో జర్నలిస్ట్ సీరియస్ అయ్యారు. "నేను లేచి వెళ్ళిపోతాను సార్.. ఇది చాలా బ్యాడ్ బిహేవియర్" అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అయితే తరుణ్ భాస్కర్ అక్కడితో ఆగకుండా నవ్వుతూనే ఉండటంతో, జర్నలిస్ట్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. "లాస్ట్ టైమ్ మీరు ఇలాగే అన్నారు, దాన్నే పట్టుకుని అందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. మేం అనలేమా మిమ్మల్ని.. ఓ ప్లాప్ డైరెక్టర్, ఓ ప్లాప్ హీరో అని మేం మాట్లాడలేమా?" అని సూటిగా ప్రశ్నించారు. రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలని, ఇది 100% తప్పని ఆయన తరుణ్ ముఖం మీదే చెప్పేశారు.
దీనికి తరుణ్ భాస్కర్ స్పందిస్తూ "సారీ సార్.. ఐ యామ్ యాక్సెప్టింగ్.. కాళ్ళు మొక్కమంటారా?" అని మళ్ళీ సెటైరికల్ గా అనడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అనవసరంగా మళ్ళీ అదే పాయింట్ తీసి ఎందుకు గొడవ చేస్తున్నారని జర్నలిస్ట్ అడగగా.. "నేను ఎప్పుడో అన్నాను.. ఇప్పుడు ఆ మాట అనలేదే" అంటూ తరుణ్ చెప్పే ప్రయత్నం చేశారు.
చివరికి జర్నలిస్ట్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవ్వగా, తరుణ్ భాస్కర్ ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశారు. "మనం మనం మెసేజ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం.. ఎందుకు సార్ ఇదంతా" అని సర్దిచెప్పారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఏది ఏమైనా 'ఓం శాంతి శాంతి శాంతిః' టీజర్ లాంచ్ ఈవెంట్ మాత్రం ఈ గొడవతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 23న రాబోతున్న ఈ సినిమాపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక తరుణ్ భాస్కర్ మరోవైపు దర్శకుడిగా కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నగరానికి ఏమైంది 2ని అనౌన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ పై త్వరలోనే ఒక అప్డేట్ రానుంది.
