తరుణ్ భాస్కర్ ఎయిర్ పోర్ట్ ఇష్యూ.. అసలు విషయమేమిటంటే?
ఫ్లైట్ మిస్ అయినట్టుగా, చిరాగ్గా బయటకు వస్తున్నట్లు సీన్ క్రియేట్ చేసి షూట్ చేశామని తరుణ్ భాస్కర్ చెప్పారు.
By: M Prashanth | 11 Feb 2026 9:34 AM ISTటాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్.. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో ఓ కెమెరా మ్యాన్ పై ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ వీడియో చూసిన సినీ ప్రియులు, నెటిజన్లు నిజంగానే ఏమైనా జరిగిందా? ఫ్లైట్ మిస్ అయ్యిందా? లేక ఎయిర్ పోర్ట్ సిబ్బందితో గొడవ జరిగిందా? అంటూ మాట్లాడుకున్నారు.
కొందరైతే ఆయన టికెట్ లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారా అంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ విషయంపై తాజాగా తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వైరల్ అయిన వీడియో అసలు గొడవ కాదని, అది తన అప్ కమింగ్ మూవీ గాయపడ్డ సింహం ప్రమోషన్స్ లో భాగమని తెలిపారు. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఆ మూవీ టీజర్ రీసెంట్ గా విడుదలైంది.
టీజర్ ను చూస్తే, అమెరికాకు వెళ్లాలనే కలలు కనే ఓ యువకుడు ఎదుర్కొనే ఇబ్బందులు చుట్టూ సినిమా తిరగనున్నట్లు తెలుస్తోంది. అదే కాన్సెప్ట్ ను ప్రమోషన్ గా ఆడియన్స్ లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేశారట. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ సజెషన్ తో ఎయిర్ పోర్ట్ వద్దే ఒక రియల్ ప్రమోషనల్ యాక్టివిటీ చేయాలని నిర్ణయించుకున్నామని తరుణ్ భాస్కర్ తెలిపారు.
ఫ్లైట్ మిస్ అయినట్టుగా, చిరాగ్గా బయటకు వస్తున్నట్లు సీన్ క్రియేట్ చేసి షూట్ చేశామని తరుణ్ భాస్కర్ చెప్పారు. అందులో భాగంగానే కెమెరా మ్యాన్ పై కోపంగా మాట్లాడినట్టు కనిపించే వీడియో తీశారట. అదే ఫుల్ వైరల్ అయిందని తెలిపారు. నిజంగా ఎయిర్ పోర్ట్ లో ఏమైంది? టికెట్ లేకుండా వెళ్లడానికి ప్రయత్నించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది కేవలం ప్రమోషనల్ యాక్ట్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
గతంలో నో ఫ్లైట్ జోన్ లో ఒక వారం రోజులు తనను పెట్టారని, అప్పట్లో తన దగ్గర ఫ్లైట్ టికెట్ కు సరిపడా డబ్బులు లేక బస్ ల్లోనే తిరిగేవాడినని సరదాగా గుర్తుచేశారు. ఈసారి మాత్రం ప్రమోషన్ కోసం వెళ్లామని తెలిపాడు. చాలామంది నిజంగానే అమెరికా వెళ్తున్నావా అని ఫోన్ చేశారని, ఏమైందని అడిగారని, అలా ప్రమోషన్ అంత బాగా వర్క్ అయ్యిందంటూ నవ్వుతూ చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చి మళ్లీ అదే ప్లేస్ లో షూట్ చేశామని చెప్పారు.
దీంతో అది తెలిసిన నెటిజన్లు ఇప్పుడు షాక్ అయిపోతున్నారు. కొందరు ఇది కొత్త మోడల్ ప్రమోషన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రాంక్లు రిస్క్ అవుతాయని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా గాయపడ్డ సింహం మూవీపై ప్రాంక్ ప్రమోషనల్ వీడియో మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారో వేచి చూడాలి.
