విజయ్ తో మరో మూవీ? తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి.
By: M Prashanth | 8 March 2026 9:36 AM ISTదర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లి చూపులు సినిమాతో వారిద్దరూ సృష్టించిన సంచలనం ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటుంటారు. ఆ సినిమా విజయంతోనే విజయ్ దేవరకొండకు హీరోగా మంచి గుర్తింపు రావడంతో పాటు ఆయన కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. తాజాగా ఒక ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ కాంబోపై చర్చలు మొదలయ్యేలా చేశాయి.
2016లో విడుదలైన పెళ్లి చూపులు చిత్రం చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. వినూత్న కథ, న్యాచురల్ కామెడీ, కొత్త తరహా కథనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం, విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు లభించాయి. ఆ సినిమా విజయంతో విజయ్ దేవరకొండకు హీరోగా మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన నటించిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు కూడా హిట్స్ అవ్వడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ– తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఒక స్టూడెంట్ ఆయనను, "రౌడీ బాయ్ తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు?" అని ప్రశ్నించింది.
దీంతో తరుణ్ భాస్కర్ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు. "ఇప్పుడే పెళ్లి అయ్యింది కదా.. కొంచెం రెస్ట్ తీసుకోనివ్వాలి. తర్వాత చూసుకుందాం" అని నవ్వుతూ చెప్పారు. వెంటనే ఆ స్టూడెంట్ "మేము వెయిటింగ్ సర్" అని చెప్పగా, హోస్ట్ చమత్కారంగా స్పందించారు. 'విజయ్ దేవరకొండ కొంతకాలం అండర్ గ్రౌండ్ లోకి వెళ్తానని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ కాంబినేషన్ గురించి చూడొచ్చు" అని పేర్కొన్నారు. దీంతో అంతా నవ్వేశారు.
అదే సమయంలో ఆ కన్వర్జేషన్ తర్వాత మరోసారి విజయ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ పై ఆసక్తి పెరిగింది. ఫన్నీ కామెంట్స్ అయినా.. ఫ్యూచర్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా ఈ నగరానికి ఏమైంది సినిమా యూత్ కు బాగా నచ్చింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం కల్ట్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అయితే ఆ సీక్వెల్ లో విజయ్ దేవరకొండ నటిస్తారనే వార్తలు గతంలో వినిపించినప్పటికీ, అందులో నిజం లేదు! ఇప్పటికే ఆ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఏదేమైనా విజయ్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
