Begin typing your search above and press return to search.

ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం మధ్య తరుణ్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈషాను తరుణ్‌కు మంచి స్నేహితురాలు, సపోర్ట్, సోల్‌మేట్‌గా ఆమె అభివర్ణించారు. దీంతో వీరి పెళ్లికి తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ENE Repeat’ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   18 Nov 2026 11:16 AM IST
ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!
X

టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ ఈషా రెబ్బాతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తరుణ్ తల్లి గీతా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఈ వార్తలకు ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

గీతా భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన కుమారుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ENE Repeat‌సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ గురించి మాట్లాడుతూనే ఈషా రెబ్బా ప్రస్తావన తీసుకురావడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ సందర్భంగా గీతా భాస్కర్ మాట్లాడుతూ.. "తరుణ్ జీవితంలో ఒక మంచి స్నేహితురాలు..ఒక మంచి వ్యక్తి, ఒక సోల్‌మేట్ గురించి చెప్పడం మర్చిపోయాను. అదే ఈషా. ఆమె తన ఫ్రెండ్ మాత్రమే కాదు.. తనకు మంచి సపోర్ట్, కుటుంబ సభ్యురాలిలాంటి వ్యక్తి. తరుణ్ పక్కన ఎవరో ఒకరు అండగా ఉన్నారనే విషయం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ తో కూడా ప్రతి విషయాన్ని పంచుకోలేం. జీవితంలో ఒక పార్ట్‌నర్ ఉండాలి. ఒక సోల్‌మేట్ ఉండాలి. ఈషా అతడికి ఇంత మంచి సపోర్ట్‌గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆమె ఇక్కడికి రాలేకపోయింది. అయినా తనకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు.

గీతా భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈషాను సోల్‌మేట్‌ అని అనడం వల్ల పెళ్లికి తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా.. అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇక 'ENE Repeat' విషయానికి వస్తే.. 2018లో విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఇది అధికారిక సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి స్నేహం, కామెడీ, యువతకు నచ్చే వినోదం ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.