తారా సుతారియా ఒకరు కాదు ఇద్దరు!
నిజానికి తార స్వతహాగా అంతర్ముఖి. పార్టీలకు వెళ్లడం లేదా కొత్త వారితో కలవడం అంటే తనకు ఇప్పటికీ కొంత ఇబ్బందిగానే ఉంటుంది.
By: Sivaji Kontham | 14 April 2026 9:25 AM ISTతారా సుతారియాకు ఒక కవల సోదరి ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. అయితే తారాకు కవల సోదరితో పోలికలు లేవు. ఇద్దరూ నాన్ ఐడెంటికల్ ట్విన్స్. తారా కంటే ఆమె సోదరికి చాలా ధైర్యం ఎక్కువ. లండన్ లో బ్యాలెట్ డ్యాన్సర్ కం మోడల్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
బాలీవుడ్ అందాల నటి తార సుతారియా తొందర్లోనే `టాక్సిక్` మూవీతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను అలరించడానికి వస్తోంది. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని దర్శకురాలు గీతు మోహన్ కితాబిచ్చారు. ఇదిలా ఉంటే తారా సుతారియా వ్యక్తిగత కుటుంబ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. తారా వెండితెరపై ఎంత గ్లామరస్‌గా కనిపించినా తన వ్యక్తిగత జీవితంలో ఒక సున్నితమైన కోణం ఉంది. తారకు పియా సుతారియా అనే కవల సోదరి ఉన్న విషయం చాలామందికి తెలియదు. వీరిద్దరూ ఒకేలా ఉండని `నాన్-ఐడెంటికల్ ట్విన్స్` .. అయినా వారి మధ్య ఉన్న అనుబంధం మాత్రం విడదీయలేనిది. చిన్నతనం నుండి ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్న తన సోదరిని తన అస్తిత్వంలో భాగంగా తార భావిస్తారు.
చిన్నతనంలో ఎదురైన ఒక సంఘటన తార మనసుపై ఇప్పటికీ చెరగని ముద్ర వేసింది. నాలుగో తరగతి వరకు ఇద్దరూ ఒకే క్లాసులో చదువుకోగా.. ఆ తర్వాత టీచర్లు వారిని వేర్వేరు సెక్షన్లలో వేయాలని నిర్ణయించారు. ఈ ఎడబాటు తారను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది. పియా తనకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి... ధైర్యమైన అమ్మాయి కావడంతో తన వెనుక దాక్కోవడం తారకు ఎంతో సురక్షితంగా అనిపించేది. ఆ రక్షణ కవచం దూరం అవుతుందన్న భయంతో తారా ఎంతో దిగులు చెందారు.
నిజానికి తార స్వతహాగా అంతర్ముఖి. పార్టీలకు వెళ్లడం లేదా కొత్త వారితో కలవడం అంటే తనకు ఇప్పటికీ కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయితే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత వృత్తిపరమైన అవసరాల కోసం ఆమె బలవంతంగా బహిర్ముఖిగా (ఎక్స్‌ట్రావర్ట్) మారాల్సి వచ్చింది. నటిగా రాణించే క్రమంలో తనలోని సామాజిక భయాన్ని అధిగమించి.. బయట ప్రపంచంతో ఎలా మెలగాలో స్వయంగా నేర్చుకున్నానని తెలిపింది.
మరోవైపు తార సోదరి పియా సుతారియా ప్రస్తుతం లండన్‌లో ప్రసిద్ధ అకాడమీల నుంచి శిక్షణ పొంది.. ప్రొఫెషనల్ బ్యాలెట్ డాన్సర్ కం మోడల్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. పియా ధైర్యవంతురాలు .. సామాజికంగా అందరితో త్వరగా కలిసిపోయే స్వభావం కలది. చిన్నతనంలో ఒకరిపై ఒకరు ఉన్న భావోద్వేగ ఆధారితత్వం వారిద్దరినీ మానసికంగా మరింత దగ్గర చేసింది.
నేడు బాలీవుడ్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతున్న తారా సుతారియా తన జీవితంలో పియా స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిదని సగర్వంగా చెబుతున్నారు. సోదరిపై ఉన్న విపరీతమైన ఆధారపడే స్వభావం నుండి బయటకు వచ్చి.. తనను తాను ఒక స్వతంత్ర వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి తారా ఎంతో శ్రమించారు. ఈ కవల సోదరీమణుల ప్రయాణం కేవలం రక్తసంబంధం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదిగిన వైనం ఆసక్తిని కలిగిస్తోంది. యష్, కియరాలతో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` తనకు బిగ్ బ్రేక్ నిస్తుందని తారా సుతారియా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టాక్సిక్ జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
